వేసవిలో పొదుపుగా నీటి వాడకం
సీలేరు: ఆంధ్ర – ఒడిశా సరిహద్దులోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని సరఫరా చేసే బలిమెల జలాశయం నీటి నిల్వలపై బుధవారం ఇరు రాష్ట్రాల అధికారులు స్థానిక ఏపీ జెన్‌కో గెస్ట్ హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిలో గ్రిడ్‌కు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.
బలిమెల జలాశయంలో ప్రస్తుతం మొత్తం 86.8499 టీఎంసీల నీరు ఉంది. దీనిలో ఒడిశా వాటా: 28.4829 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటా: 58.3670 టీఎంసీలు ఉన్నట్టు అధికారులు లెక్క తేల్చారు. విద్యుత్ ఉత్పత్తి, సాగు నీటి అవసరాల కోసం ఒడిశా రోజుకు 3వేలు క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ 6,500 క్యూసెక్కుల నీటిని వాడుకునేందుకు పరస్పర అంగీకారం కుదిరింది. 2024–25 నీటి సంవత్సరంలో (జూలై నుంచి జనవరి వరకు) ఒడిశా 58.2836 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ 28.3996 టీఎంసీలు వినియోగించింది. ఈ సమావేశంలో ఒడిశా నీటిపారుదల శాఖ, ఓహెచ్‌పీసీఎల్ అధికారులతో పాటు ఏపీ జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ జాకీర్ హుస్సేన్, హనుమ, ఏడీ జయపాల్ తదితరులు పాల్గొన్నారు.


