నిరుపయోగం | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగం

Feb 12 2026 7:22 AM | Updated on Feb 12 2026 7:22 AM

నిరుపయోగం

నిరుపయోగం

నాడు
చింతపల్లిలో ఖాళీగా యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ భవనం

గిరిజన యువత భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన జిల్లాలోని ఏకైక శిక్షణ కేంద్రం.. నేడు నిశ్శబ్దానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. రూ.కోట్ల ప్రజాధనంతో చింతపల్లిలో నిర్మించిన యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ పాలకుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా పడి ఉంది. ఒకప్పుడు విద్యార్థులు, నిరుద్యోగులతో కళకళలాడిన ఈ భవనం, నేడు కేవలం ఒక ఖాళీ కట్టడంగా మిగిలిపోవడంపై మన్యం యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కలల సౌధం..

నేడు

చింతపల్లి: మండలకేంద్రం చింతపల్లికి పొలిమేరలోని కొండపై, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గిరిజన యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు రూ.కోట్లతో నిర్మించిన యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నేడు నిరుపయోగంగా మారింది. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలతో పాటు పాడేరు డివిజన్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు అండగా నిలవాల్సిన ఈ కేంద్రం, ప్రస్తుతం ఎందుకూ పనికిరాకుండా పడి ఉంది.

అనేక శిక్షణలకు వేదికగా..

పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం చింతపల్లిలోని సాయిబాబా ఆలయ సమీపంలో అన్ని వసతులతో ఈ భవనాన్ని నిర్మించింది. ప్రారంభంలో ఇక్కడ గిరిజన యువతీ యువకులకు కంప్యూటర్‌ కోర్సులు, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఇంగ్లీష్‌ స్కిల్స్‌, స్వయం ఉపాధి కోర్సులతో పాటు పోలీసు కానిస్టేబుల్‌, ఏపీపీఎస్సీ గ్రూప్స్‌ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేవారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు ప్రత్యేకంగా టైలరింగ్‌ శిక్షణ కూడా ఇక్కడ నిర్వహించేవారు.

ఏకలవ్య నుంచి కోవిడ్‌ సెంటర్‌ వరకు..

చింతపల్లిలో తొలిసారిగా ప్రారంభించిన ఏకలవ్య ఆదర్శ పాఠశాల గత విద్యా సంవత్సరం వరకు ఇక్కడే కొనసాగింది. అంతేకాకుండా ఐటీడీఏ, మాక్స్‌ ఆధ్వర్యంలో కాఫీ గింజల నిల్వ, రైతులతో సమావేశాలు, వేలం వంటి కార్యక్రమాలు కూడా ఇక్కడే జరిగేవి. కరోనా సమయంలో ఈ కేంద్రాన్ని క్వారంటైన్‌ సెంటర్‌గా ఉపయోగించి ఎంతో మందికి సేవలందించారు. గత రెండు, మూడు నెలల క్రితం వరకు కొయ్యూరు ఏకలవ్య ఆదర్శ పాఠశాల కూడా ఇక్కడే నిర్వహించారు. అయితే, కొయ్యూరులో నూతన భవనం అందుబాటులోకి రావడంతో పాఠశాలను అక్కడికి తరలించారు. అప్పటి నుంచి ఈ యూత ట్రైనింగ్‌ సెంటర్‌ భవనం ఖాళీగా ఉండి, క్రమంగా పాడవుతోంది. రూ.కోట్ల ప్రజా ధనంతో నిర్మించిన ఈ భవనం నిరుపయోగంగా ఉండటంపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఈ శిక్షణ కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement