జి.మాడుగుల: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అల్లూరి జిల్లా పాడేరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ఆర్. అభిషేక్ పిలుపునిచ్చారు. ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు, మండలంలోని మద్దిగరువు గ్రామంలో గురువారం భారీ స్థాయిలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి వంటి వ్యసనాలు యువత జీవితాలను నాశనం చేయడమే కాకుండా, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. వీటితో పాటు సైబర్ నేరాలు మరియు రోడ్డు భద్రతా నియమాలపై కూడా అవగాహన కల్పించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు కాకినాడ శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. మెగా వాలీబాల్ టోర్నమెంట్‌లో గిరిజన ప్రాంతాల నుంచి 20 జట్లు పాల్గొన్నాయి. ప్రథమస్థానం సాధించిన మద్దిగరువు జట్టుకు రూ.10 వేల నగదు, వాలీబాల్ కిట్, ద్వితీయ స్థానం సాధించిన మడతకొండ జట్టురే నై.5 వేల నగదు, వాలీబాల్ కిట్, సూరిమెట్ట, బొయితిలి జట్లకు క్రికెట్ కిట్లను అందజేశారు. అనంతరం స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేసి, పోలీస్ శాఖ పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎంపీపీ అప్పలరాజు, ఎస్‌ఐ సాయిరాం పడాల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పాడేరు డీఎస్పీ అభిషేక్


