● కలెక్టర్ దినేష్‌కుమార్
● బదిలీపై వెళ్తున్న ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు
పాడేరు: గిరిజన ప్రాంతంలో కలెక్టర్‌గా పని చేయడం తన అదృష్టమని, రెండేళ్లకు పైగా స్థానిక గిరిజనులతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. గిరిజనులతో ఎంతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నానని, జిల్లాను విడిచి వెళ్లడం బాధగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఏపీఐఐసీ ఎండీగా బదిలీపై వెళ్తున్న కలెక్టర్ దినేష్ కుమార్‌కు గురువారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ సహా వివిధ శాఖల అధికారులు కలెక్టర్‌తో తమకున్న పని అనుభవాన్ని, అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జిల్లా అధికారులతో పాటు పలు ప్రజా, గిరిజన సంఘాల నాయకులు కలెక్టర్‌ను దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. అంతకుముందు, పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ సెంటర్ నుంచి సినిమా హాల్ సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్, తలారిసింగ్ జంక్షన్ మీదుగా కలెక్టరేట్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కలెక్టర్‌కు వీడ్కోలు పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు.


