ముంచంగిపుట్టు: విధి నిర్వహణలో సమయపాలన పాటించని గ్రామ సచివాలయ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. గురువారం మండలంలోని కర్రిముఖిపుట్టు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐదుగురు ఉద్యోగులు ఉండాల్సిన చోట ఉదయం 11 గంటలైనా కేవలం ఇద్దరు మాత్రమే ఉండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో పుస్తకాలు చదివించి, పలు ప్రశ్నలు వేసి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు పథకంలో కింద మంజూరైన పాఠశాల భవన పనులు అసంపూర్తిగా ఉండటంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థులకు కనీస వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవన పనుల అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు అర్జున్, కొండబాబుపాల్గొన్నారు.
రేషన్ బియ్యం పంపిణీలో జాప్యంపై ఆగ్రహం
పెదబయలు: కూటమి ప్రభుత్వంలో రేషన్ కార్డుదారులకు తిప్పలు తప్పడం లేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం విమర్శించారు. గురువారం ఆయన పెదబయలులోని రేషన్ డిపోను ఆకస్మికంగా తనిఖీ చేసి, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రోజువారీ విక్రయాల వివరాలు రికార్డుల్లో నమోదు చేయకపోవడంపై జీసీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. సుమారు 100 మంది కార్డుదారులకు ఫింగర్ ప్రింట్ తీసుకున్నప్పటికీ, రెండు టన్నుల బియ్యం పంపిణీ చేయలేదని ఫిర్యాదు చేశారు. గత రెండు నెలల బకాయిల గురించి అడిగితే పాత సేల్స్‌మన్ ఇవ్వాలని, తాము ఈ నెల కోటా మాత్రమే ఇస్తామని ప్రస్తుత సిబ్బంది చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే చొరవతో బకాయిల పంపిణీ
మెషీన్‌లో నమోదైన తర్వాత కూడా బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ అందేదని, నేడు డిపోల చుట్టూ తిరిగినా బియ్యం దొరకని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదేశాలతో జీసీసీ మేనేజర్ అప్పన్న సమక్షంలో లబ్ధిదారులకు గత రెండు నెలల బకాయి రేషన్‌ను వెంటనే పంపిణీ చేశారు. కార్డుదారులకు రేషన్ ఇవ్వడంలో కోతలు విధిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. తమకు న్యాయం చేసిన ఎమ్మెల్యేకు కార్డుదారులు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సందడి కొండబాబు పాల్గొన్నారు.
అరకు ఎమ్మెల్యే
రేగం మత్స్యలింగం హెచ్చరిక


