● గోదావరి డెల్టాకు 12 టీఎంసీలు విడుదల
● చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు
సీలేరు: ఏపీ జెన్‌కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో గడిచిన వారం రోజులుగా జోరుగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని కాంప్లెక్స్ చీఫ్ ఇంజనీర్ కేవీ రాజారావు తెలిపారు. గురువారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వేసవిలో ఏప్రిల్, మే నెలలో రాష్ట్రానికి విద్యుత్ ఉత్పత్తి అందించడంలో సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. దీనిలో భాగంగానే సీలేరు, మాచ్ ఖండ్, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాల్లో రోజుకు గత వారం రోజులుగా 9 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అన్నారు. మార్చి నాటికి 2314 మిలియన్ యూనిట్లు లక్ష్యం కాగా అంతకు మించి 24 65 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశామన్నారు. ప్రస్తుతం డొంకరాయి యూనిట్‌లో చేపట్టిన మరమ్మతు పనులు 45 రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. సీలేరు విద్యుత్ కాంప్లెక్స్‌లో విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి బలిమెల జలాశయం నుంచి గడిచిన వారం రోజులుగా రోజుకు 8 క్యూసెక్కులు సీలేరు జలాశయంలోకి తీసుకుంటున్నామని అన్నారు. బుధవారం రాత్రి నుంచి 4వేల క్యూసెక్కులు మాత్రమే విడుదలవుతుందని.. ప్రస్తుతం ఆ నీటితో సీలేరు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా రోజుకు మూడు మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరుగుతందని తెలిపారు ప్రస్తుతం బలిమెల జలాశయంలో ఆంధ్రా వాటా నీటిని కలుపుకొని సీలేరు, డొంకరాయి జలాశయంలో మొత్తం 57.2563 టీఎంసీల నీరు ఉందని అన్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు డొంకరాయి మెయిన్ డ్యామ్ ద్వారా గోదావరి డెల్టాకు 12 టీఎంసీల వరకు నీటిని విడుదల చేశామన్నారు. ఆయన వెంట ఎస్‌ఈ జాకీర్ హుస్సేన్, మోతుగూడెం డీఈ బాలకృష్ణ ఉన్నారు.


