పాయకరావుపేట: పట్టణంలో రూ.5.20 కోట్లతో విస్తరిస్తున్న మెయిన్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా, ఉప సర్పంచ్ జగతా భవానీశ్రీనివాస్, పట్టణ శాఖ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్ విమర్శించారు. పట్టణంలో దగ్గుపల్లి సాయిబాబా కార్యాలయంలో గురువారం వారు మాట్లాడుతూ వీఎంఆర్‌డీఏ నిధులతో చేపట్టిన విస్తరణ పనుల్లో అధికారుల పర్యవేక్షణ లేదన్నారు. కరెంటు లేకుండానే రాత్రిపూట పనులు చేపడుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మిగిలిన మూడేళ్ల పాటు మనుగడ ఉండేలా రోడ్డు నిర్మిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆ తర్వాత ఎలా పోయినా పర్వాలేదన్నట్లు కాంట్రాక్టర్లు, కూటమి నాయకుల వ్యవహారశైలి ఉందన్నారు. పూర్తిగా కూటమి నాయకుల కనుసన్నల్లోనే పనులు జరగడం వల్ల నాణ్యత లోపించిందన్నారు. ఎస్టిమేషన్‌లో పేర్కొన్న విధంగా మెటీరియల్‌ను సముపాళ్లలో వినియోగించడం లేదన్నారు. 20 ఎంఎం, 40 ఎంఎం, క్రషర్ చిప్స్ బూడిద వేయాల్సి ఉండగా, బూడిద మాత్రమే వేస్తున్నారన్నారు. సరిగ్గా రోలింగ్ చేయడం లేదన్నారు. రోడ్డు విస్తరణ చేసేందుకు హోం మంత్రి నిర్ణయించినప్పుడు పాయకరావుపేట పట్టణాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని స్వాగతించామన్నారు. రోడ్డుపై చిరువ్యాపారులకు న్యాయం చేయలేదన్నారు. వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఇంతవరకు చూపలేదన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి ఆపేశారన్నారు. కోర్డు వివాదం కారణంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విస్తరణను పక్కన పెట్టి కొత్త రోడ్డు నిర్మించామన్నారు. అదే సమయంలో రోడ్డుకు ఇరువైపులా వేసిన బెర్మ్‌లను ఇప్పుడు తొలగిస్తున్నారన్నారు. తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్‌ను అనధికార లేఅవుట్‌లకు తరలిస్తున్నారన్నారు. హోం మంత్రి ఈ రెండు విషయాలపై దృష్టి సారించాలన్నారు. నాసిరకం పనులపై విచారణ జరిపించాలని, బెర్మ్ తవ్వకాల్లో వచ్చిన గ్రావెల్‌ను తరలిస్తున్న అనధికార లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాసిరకం పనులపై క్వాలిటీ కంట్రోలు, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో వార్డు సభ్యులు కొప్పిశెట్టి మోహన్, పిరాది రాజు, తుమ్మలపల్లి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు కేశనకుర్తి సత్తిబాబు, కోనేటి పద్మారావు, పోసిన వీరబాబు, కె. రంగ తదితరులు పాల్గొన్నారు.


