పాత హామీలు నెరవేర్చాకే ‘ఏరోడ్రోమ్‌’ నిర్మించండి | - | Sakshi
Sakshi News home page

పాత హామీలు నెరవేర్చాకే ‘ఏరోడ్రోమ్‌’ నిర్మించండి

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

స్థానిక నిరుద్యోగ యువతకు

ఉపాధి కల్పించాలి

ప్రజాభిప్రాయ సేకరణలోగ్రామస్తుల డిమాండ్‌

సీలేరు: గతంలో ఇచ్చిన హామీలనే గాలికి వదిలేశారు.. ఇప్పుడు కొత్త ప్రాజెక్టు అంటే నమ్మేదెలా?.. అంటూ సీలేరు గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. సీలేరు గుంటవాడ రిజర్వాయర్‌లో ప్రతిపాదించిన వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టుపై గురువారం ఏపీ జెన్‌కో కల్యాణ మండపంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏపీ ఎయిర్‌ పోర్ట్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, గత ఏడాది పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టు (1350 మెగావాట్లు) సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. వాటర్‌ ఏరోడ్రోమ్‌ ప్రాజెక్టులో వచ్చే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సీలేరు నిరుద్యోగులకే కేటాయించాలని, ఎంతమందికి ఉద్యోగాలిస్తారో ముందే రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం నిధులను సీలేరు ప్రాంత అభివృద్ధి పనులకే ఖర్చు చేయాలని కోరారు. దశాబ్దాల క్రితం జలవిద్యుత్‌ కేంద్రం కోసం పనిచేసిన కూలీల వారసులకు, స్థానికులకు ఈ ప్రాజెక్టుల్లో తగిన గుర్తింపు, హక్కులు కల్పించాలని వారు కోరారు. ఈ డిమాండ్లు నెరవేర్చినప్పుడే ప్రాజెక్టు నిర్మాణానికి గ్రామం తరఫున పూర్తి సహకారం అందిస్తామని గ్రామస్తులు తేల్చి చెప్పారు.

పర్యావరణానికి ఢోకా లేదు..

కాలుష్య నియంత్రణ మండలి ఈఈలు సరిత, ఉపేంద్ర, టూరిజం డీవీఎం జగదీష్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, అటవీ సంపదకు ఎలాంటి హాని జరగదని వివరించారు. ఇది పూర్తిగా నీటిపై తేలుతూ ఉండేలా డిజైన్‌ చేసిన ప్రాజెక్ట్‌ అని, దీనివల్ల పక్షులకు కూడా ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఏపీ ఎయిర్‌ పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.

పర్యాటక రంగ అభివృద్ధిని పెంచేలా

ప్రాజెక్టులు : ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజ

జిల్లాలో పర్యాటక అభివృద్ధి మరింత పెంచేలా ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపుతాయని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ అన్నారు. స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రూ 16.45 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటక రంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. లంబసింగి నుంచి సప్పర్ల రెయిన్‌గేజ్‌, ఘాట్‌ రోడ్‌ దారాలమ్మ ఆలయం, సీలేరు జల విద్యుత్‌ కేంద్రం, జలపాతాలకు సందర్శకుల తాకిడి పెరుగుతుందన్నారు. ఇటువంటి కీలక ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. తహసీల్దార్‌ అన్నాజీరావు, ఎంపీటీసీ సాంబమూర్తి, సర్పంచ్‌ దుర్జో, ఉపసర్పంచ్‌ వల్లి ప్రసాద్‌, గిరిజన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement