ప్పం ట్టాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

ప్పం ట్టాల్సిందే..!

Apr 3 2026 7:56 AM | Updated on Apr 3 2026 7:56 AM

తట్టెడు మట్టికీ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

ట్టెడు మట్టికీ తలవంచాల్సిందే.. పిక్కెడు రాయికీ పిండుకోవాల్సిందే.. ఉమ్మడి విశాఖ జిల్లాలో ’రాయల్టీ’ పేరిట ఏఎంఆర్‌ సంస్థ సాగిస్తున్న అక్రమ వసూళ్లు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సొంత పొలంలో మట్టి తీసినా, సొంత ఇంటికి రాయి తెచ్చినా.. ఎక్కడ చిన్న ఇసుక కుప్ప కనిపించినా.. ప్రైవేటు సంస్థ ప్రతినిధులు స్కానర్లు పట్టుకుని వాలిపోతున్నారు. లోడును బట్టి వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్‌ శాఖ అండతో గ్రామగ్రామాన చెక్‌పోస్టులు పెట్టి సాగిస్తున్న ఈ ’దోపిడీ’ పర్వంపై జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

చెక్‌పోస్టులు.. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ల దందా

వాస్తవానికి గతంలో రాయల్టీ వసూలు బాధ్యతను మైనింగ్‌ శాఖే నిర్వహించేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధ్యతను జిల్లాల వారీగా ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించారు. ఇందుకోసం మైనింగ్‌ శాఖ టెండర్లను ఆహ్వానించగా.. విశాఖ జిల్లాలో ఈ టెండర్‌ను ఏఎంఆర్‌ సంస్థ దక్కించుకుంది. టెండర్‌ పొందినప్పటి నుంచి సంస్థ ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వాహనాలతో ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ పేరుతో గ్రామాల్లో తిరుగుతోంది. ఎక్కడైనా చిన్న ట్రాక్టర్‌లో మట్టి కనిపించినా, ఎర్రపిక్క కనిపించినా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తోంది. తమ సొంత పొలంలో నుంచి మట్టిని తీసుకెళుతున్నా ఎందుకు డబ్బులు ఇవ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక వసూలు చేసే మొత్తాన్ని స్కానర్‌ ద్వారా సేకరిస్తున్నప్పటికీ, ఆ వివరాలను మైనింగ్‌ శాఖకు క్రమం తప్పకుండా సమర్పిస్తున్నారా లేదా అన్నది స్పష్టంగా తెలియడం లేదనే విమర్శలు ఉన్నాయి. వసూలైన డబ్బులు కంపెనీ ఖాతాలోకే వెళుతున్నాయా, లేక సొంత ఖాతాలకు మళ్లుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా, వసూలు చేస్తున్న రాయల్టీకి సరైన బిల్లులు ఇస్తున్నారా అనే అంశాన్ని కూడా మైనింగ్‌ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద మైనింగ్‌ శాఖ మౌనంతో ఏఎంఆర్‌ సంస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాయల్టీ వసూలు పేరుతో రుబాబు..!

రాయల్టీ వసూలు బాధ్యతను దక్కించుకున్న ఏఎంఆర్‌ సంస్థ ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసుకుంది. చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించింది. అక్కడ పనిచేసే సిబ్బంది క్వారీల నుంచి వచ్చే వాహనాల లోడ్‌ను గమనిస్తూ, అదనపు లోడు ఉంటే అదనపు రాయల్టీని ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ‘ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌’ పేరుతో జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ, ఎక్కడైనా ఇంటి అవసరాల కోసం మట్టిని తరలిస్తున్నా రాయల్టీ చెల్లించాల్సిందేనంటూ వాలిపోతున్నారు. ఇంటి నిర్మాణం కోసం కొద్దిపాటి పిక్క తీసుకున్నా వందల్లో రాయల్టీ చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రైతులు తమ సొంత పొలంలో నుంచి మట్టిని తవ్వుకుని ఇంటి నిర్మాణం కోసం తరలిస్తున్నా అక్కడికక్కడే సిబ్బంది చేరుతున్నారు.

రాయల్టీ కట్టాల్సిందేనంటూ చెబుతూ, ఎంత మొత్తం చెల్లించాలనే విషయాన్ని స్కానర్‌ ద్వారా చూపించి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మైనింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ‘మాకు సంబంధం లేదు’ అంటూ తప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాయల్టీ పేరుతో ఏఎంఆర్‌ రుబాబు ఇంటి నిర్మాణం కోసం పిక్కకు రొక్కం లెక్క ఉమ్మడి జిల్లాలో ఇష్టారాజ్యంగా చెక్‌పోస్టుల ఏర్పాటు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో గ్రామాల్లో వేట ట్రాక్టర్‌ కనిపిస్తే స్కానర్‌ ఓపెన్‌ రూ.వందల నుంచి రూ.వేల వరకూ వసూళ్లు సొంత పొలం మట్టికీ రాయల్టీ తప్పదా..? మైనింగ్‌శాఖ మౌనం విమర్శలకు తావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement