కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
జి.మాడుగుల: కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం మండలంలోని కుంబిడిసింగి, బొయితిలి, కిల్లంకోట పంచాయతీల్లోని పలు గ్రామాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. కుంబిడిసింగి వెళ్లే మార్గంలో గెడ్డపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అలాగే, కిల్లంకోట గ్రామ సమీపంలోని గెడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి మరో మూడు నెలల్లో టెండర్లు ఖరారు చేసి, పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కిల్లంకోట పంచాయతీ చిలకపనస గ్రామంలో జరుగుతున్న తారు రోడ్డు పనులను తనిఖీ చేశారు.కె.బందవీధి నుంచి బొయితిలి ఆశ్రమ పాఠశాల వరకు జరుగుతున్న పనులు ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతాయని, త్వరలోనే రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెదబయలు మండలం బూరికిపనస సమీపంలోని కల్వర్టు పనులు పూర్తికాగానే, మార్చి నాటికి గ్రామం వరకు తారు రోడ్డు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కుంబిడిసింగిలో పంచాయతీ భవనం లేక పడుతున్న ఇబ్బందులను గిరిజనులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. స్థానిక ఎంపీపీ లంబోరి అప్పలరాజు కలెక్టర్‌ను కలిసి పలు ప్రాంతాల్లో కొత్త రోడ్ల మంజూరు కోసం కోరారు. దిగరాపల్లి ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి జాములవీధి వరకు రెండు కిలోమీటర్లు, పులుసుమామిడి ఘాట్ నుంచి సిరిసపల్లి వరకు రెండు కిలోమీటర్లు, వాకపల్లి రోడ్డు నుంచి తోకగరువు వరకు 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్లు, మండిభ నుంచి రాసవీధి వరకు 2.5 కిలోమీటర్ల కొత్తరోడ్డు, మడతకొండ నుంచి రెయ్యిలగెడ్డ, వణుకూరు, సారాపల్లి వరకు 3.5 కిలోమీటరు మేర రోడ్లకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుభద్ర, సర్పంచ్‌లు కృష్ణమూర్తి, లసంగి మాలన్న, మాజీ సర్పంచ్ రామన్న, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు


