నిబంధనల ప్రకారమే ఆదిత్యకు ధ్రువపత్రం జారీ
అరకులోయ టౌన్: మండలంలోని పద్మాపురం పంచాయతీ, ఎండపల్లివలస గ్రామానికి చెందిన ఎండపల్లి ఆదిత్యకు గతంలో రెవెన్యూ శాఖ జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తహసీల్దార్ కె. కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆదిత్యకు నకిలీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్లు కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై వివరణ ఇచ్చారు. ఆదిత్య తండ్రి (లేటు) ఎండపల్లి కన్నంనాయుడుకు సంబంధించి 1982 నాటి టీసీతో పాటు 2005, 2017, 2022, 2024 సంవత్సరాల్లో అరకులోయ తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ అయిన కొండదొర (ఎస్టీ) కుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించినట్లు తెలిపారు. అదేవిధంగా ఆదిత్య చదువుకున్న టీసీ, 2013 నుంచి 2025 వరకు వివిధ సంవత్సరాల్లో అతను పొందిన ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల ఆధారంగానే ఈ సర్టిఫికేట్ ఇచ్చామన్నారు. రైల్వే శాఖలో పనిచేస్తూ మృతి చెందిన కన్నంనాయుడు వారసుడిగా ఆదిత్య ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అతని కులాన్ని నిర్ధారించాలని కోరుతూ రైల్వే అధికారులు 2025 సెప్టెంబర్ 18, డిసెంబర్ 24 తేదీల్లో తహసీల్దార్‌కు లేఖలు రాశారన్నారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వీఆర్వోలు ఎండపల్లివలసలో క్షేత్రస్థాయి విచారణ (పంచనామా) నిర్వహించి, వారు కొండదొర కులానికి చెందిన వారని నిర్ధారించిన తర్వాతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేశామని వివరించారు. ఈ విషయంలో ఎవరికై నా ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా తమ కార్యాలయానికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చని తహసీల్దార్ తెలిపారు.
అరకు తహసీల్దార్ కుమారస్వామి


