36 టన్నుల మేర కాఫీ కొనుగోలు
● జీసీసీ బ్రాంచి మేనేజర్ అప్పన్న
మాట్లాడుతున్న జీసీసీ మేనేజర్ అప్పన్న
పెదబయలు: స్థానిక జీసీసీ బ్రాంచ్ పరిధిలో 70 టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 36 టన్నులు కొనుగోలు చేశామని బ్రాంచ్ మేనేజర్ జి.అప్పన్న తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కాఫీ కొనుగోలుకు సంబంధించి రూ.1.70 కోట్లతో కాఫీ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. కాఫీ గింజలను నేరుగా గ్రామాల్లో రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర రైతులు ముందుగానే అడ్వాన్సులు తీసుకుని ఉన్నందున వారికి ఎక్కువ మొత్తంలో కాఫీ ఇస్తున్నారన్నారు. రైతులకు జీసీసీ ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా ఈ ఏడాది 62 మంది కాఫీ రైతులకు రూ. 5 45 లక్షలు రుణాలు ఇచ్చామన్నారు. గిరిజనులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలకు విక్రయించాలని ఆయన కోరారు. కాఫీ అమ్మకాలు చేసిన రైతులకు 24 గంటల లోపే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.


