ఉపాధి హామీ పనుల తనిఖీ
దేవరాపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్రం నుంచి వచ్చిన అధికారితో కూడిన బృందం పరిశీలించింది. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ, చిననందిపల్లి, తారువ, బోయిలకింతాడ, కొత్తపెంట తదితర గ్రామాల్లో బుధవారం అధికార్లు పర్యటించారు. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఫొటోలను మండలాల వారీగా ఆన్‌లైన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించారు. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని అక్కడ నిబంధనల ప్రకారం పని జరిగిందా లేదా అని క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన చేశారు. జలసంచయ్–భాగీదారీ పథక కేంద్ర నోడల్ అధికారి, కేంద్ర జల కమిషన్ సబ్ డివిజన్ ఇంజినీర్ సుగుణాకరరావు, డ్వామా నుంచి ఇంజినీరింగ్ కన్సల్‌టెంట్ బాలు తదితర అధికారులు చెరువులు, నీటి గుంతల పనులను పరిశీలించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఉపాధి హామీ పథకం ఏపీవో వై. రుక్మిణీదేవి, ఈసీ వెంకటేష్, లక్ష్మణరావు, ఎర్రునాయుడు, సత్యనారాయణ ఉన్నారు.


