కూటమి వైఫల్యాలపై పోరుబాట | - | Sakshi
Sakshi News home page

కూటమి వైఫల్యాలపై పోరుబాట

Feb 12 2026 7:22 AM | Updated on Feb 12 2026 7:22 AM

కూటమి వైఫల్యాలపై పోరుబాట

కూటమి వైఫల్యాలపై పోరుబాట

యువతే పార్టీకి ఆయువుపట్టు

ప్రజల పక్షాన యువజన విభాగం పోరాడాలి

1.70 లక్షల సైన్యం సిద్ధమవుతోంది

ఉత్తరాంధ్ర యువజన విభాగం

విస్తృత స్థాయి సమావేశంలో

జక్కంపూడి రాజా

శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్‌ దారుణం

మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌

మాజీ డిప్యూటీ సీఎం

బూడి ముత్యాలనాయుడు

సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్‌ అధ్యక్షుడు అంబటి శైలేష్‌ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

యువజన విభాగమే గొంతుక కావాలి

ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్‌ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, గతంలో యువజన విభాగంలో పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్‌ చైర్మన్‌లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ఎవరైతే శ్రమిస్తారో వారికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ వంటి హామీలను తుంగలో తొక్కింది. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఎండీయూ వాహన ఆపరేటర్లు, వలంటీర్లు సహా అనేక సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను రోడ్డున పడేసింది. విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసింది. వీటిపై యువత పోరాటం చేయాలి’అని రాజా పిలుపునిచ్చారు.

దాడి చేసిన వారికి బెయిల్‌.. ప్రశ్నించిన అంబటికి జైలా?

ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోల్‌ బాంబులు విసిరిన వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసిన వారిని అరెస్ట్‌ చేయడం చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

జగన్‌ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట

జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్‌ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్‌ హయాంలో యూత్‌ కాంగ్రెస్‌లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్‌ సీపీ లో ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి, ప్రజా సేవ చేయాలనుకునే వారికి యువజన విభాగం మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. గాజువాక సమన్వయకర్త దేవన్‌ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ‘ఉత్తి ఆంధ్ర’కాదు ‘ఉద్యమాంధ్ర’అని చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే.. కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్‌, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్‌ ఇమ్రాన్‌, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్‌, గబ్బిడి శేఖర్‌, అల్లు అవినాష్‌, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దొడ్డి కిరణ్‌, పాలిశెట్టి సురేష్‌, యువజన విభాగం కార్యదర్శులు చింతకాయల వరుణ్‌, మలసాల కుమార్‌ రాజా, కనకల ఈశ్వరరావు, చందక అప్పలస్వామి, సంయుక్త కార్యదర్శులు జె.నరేష్‌, ధీరజ్‌ కుమార్‌, నియోజకవర్గం, మండల, వార్డు యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement