దురుద్దేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం
దేవరాపల్లి: సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను తగ్గించేలా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలవ లేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ పదే పదే విష ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని, ఇప్పుడేమో ఏకంగా బాత్‌రూమ్‌లు కడిగే హార్పిక్స్ తయారీకి వినియోగించే కెమికల్స్ కలిపారని దు ష్ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమన్నా రు. మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లాలన్న దుర్బుద్ధితోనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. వీరిద్దరితో పాటు కూటమి నేతలంతా శ్రీవారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా దేవుడితో రాజకీయాలు చేయడం మానుకుని పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడి చేసే విష సంస్కృతిని విడనాడాలని హితవు పలికారు.


