● పోతురాజు బాబు ఆలయానికి షెడ్డు నిర్మాణం ● రిటైర్డ్ ఉద
పుట్టిన ఊరిపై మమకారం
కొయ్యూరు: ఉద్యోగ రీత్యా ఎక్కడో స్థిరపడినా, కన్నతల్లిని.. ఉన్న ఊరిని మర్చిపోకూడదని నిరూపించారు రిటైర్డ్ ఉద్యోగి జంపా అప్పారావు. తన సొంత గ్రామమైన రావణాపల్లి పంచాయతీ తోట లూరుపై ఉన్న ప్రేమతో, అక్కడి స్థానిక ఆలయ అభివృద్ధికి ఆయన చేయూత అందించారు.
భక్తుల సౌకర్యార్థం రూ. 50 వేలతో అభివృద్ధి
తోటలూరులోని శ్రీశ్రీశ్రీ పోతురాజు బాబు ఆలయం సరైన వసతులు లేక ఇబ్బందిగా ఉండటాన్ని గమనించిన అప్పారావు, భక్తుల సౌకర్యార్థం ఆలయం ముందు షెడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సుమారు రూ. 50 వేలు సొంత నిధులతో రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. ఆయన ఎంఎంటీసీలో పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం వేరే ప్రాంతంలో స్థిరపడ్డారు. అయినప్పటికీ గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం షెడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. మంగళవారం షెడ్డు పనులను పర్యవేక్షించిన అనంతరం ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సొంత ఊరిలోని ఆలయానికి చిన్న సేవ చేసే అవకాశం రావడం నా అదృష్టం. తోటలూరుకు చెందిన ఎంతోమంది వివిధ ప్రభుత్వ, ప్రైవేటు శాఖల్లో ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. వారందరూ కూడా తమ వంతుగా గ్రామాభివృద్ధికి సహకరించాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఆయన దాతృత్వాన్ని చూసి తోటలూరు గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. తోటి ఉద్యోగులకు ఆయన ఒక ఆదర్శంగా నిలిచారని స్థానికులు కొనియాడారు.


