ఇచ్చిన హామీలు నిలబెట్టుకో చంద్రబాబు
ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామారావుదొర డిమాండ్
సాక్షి,పాడేరు: ఎన్నికలకు ముందు అరకు సభలో ఆదివాసీలకు ఇచ్చిన నూరుశాతం ఉద్యోగాల హమీని సీఎం చంద్రబాబు వెంటనే నిలబెట్టుకోవాలని ఆదివాసీ జేఏసీ జిల్లా అధ్యక్షుడు రామారావుదొర డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జీవో నంబరు 3 పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ జీవోను జారీ చేసి గిరిజన ప్రాంతాలలో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు రెండేళ్లు కావవస్తున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.
గత ఏడాది మెగా డీఎస్సీలో గిరిజన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన రాబోయే డీఎస్సీలో మళ్లీ గిరిజనులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉందన్నారు. గిరిజన అభ్యర్థులకు న్యాయం జరగాలంటే ఈనెల 11వతేదీ బుధవారం జరిగే 114వ గిరిజన సలహా మండలి(టీఏసీ) సమావేశంలో సీఎం చంద్రాబు, గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గిరిజనులకు నూరుశాతం ఉద్యోగాల జీవోకు చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన సలహా మండలి
మినీ రాజ్యాంగం
గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గిరిజన సలహా మండలి మినీ రాజ్యాంగమని, అందులో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు,ఇతర సభ్యులంతా గిరిజనులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 1/70 భూ బదలాయింపు నిషేద చట్టం రద్దుకు సుప్రీంకోర్టులో దాఖలైన కేసుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే ఇంప్లీడ్ పిటిషన్ వేయాలని ఆయన కోరారు..రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన పోలవరం జిల్లాలో ఏలూరు జిల్లా పరిధిలోని షెడ్యూల్ ప్రాంతాన్ని కలిపి, కారం తమ్మన్నదొర పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.


