నకిలీ కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ జరిపించాలి
అరకులోయ టౌన్: మండలంలోని పద్మాపురం పంచాయతీ, ఎండపల్లివలస గ్రామానికి చెందిన ఎండపల్లి ఆదిత్య (తండ్రి (లేటు) కన్నం నాయుడు) పొందిన నకిలీ కొండదొర కుల ధ్రువీకరణ పత్రంపై సమగ్ర విచారణ జరపాలని అరకుఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండపల్లి ఆదిత్యకు 2025 జూలై 17న ‘కొండదొర’ కుల ధ్రువీకరణ పత్రం జారీ అయ్యిందని, ప్రస్తుతం ఆయన రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.దీనిపై గతంలో గిరిజనులు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుత తహసీల్దార్ కమక కుమారస్వామి, అప్పటి ఆర్‌ఐ, వీఆర్వోలు ధ్రువీకరించిన పత్రాలను పరిశీలించి, అది అసలైనదేనని పేర్కొంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్‌ను రైల్వే అధికారులకు పంపడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎండపల్లివలసలో నివసిస్తున్న ఆదిత్య వాస్తవానికి కొండకాపు కులానికి చెందిన వ్యక్తి అని, అటువంటప్పుడు కొండదొర సర్టిఫికెట్ ఎలా జారీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. తప్పుడు ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అప్పటి తహసీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే మత్స్యలింగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం డిమాండ్


