కక్ష సాధింపుతో కాపులపై అక్రమ కేసులు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు
పాయకరావుపేట: కాపులపై కక్ష సాధింపుతో సీఎం చంద్రబాబు అన్యాయంగా కేసులు బనాయించడం తగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కాపు నేతలను విమర్శించడంపై మండలంలోని మాసాహేబుపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఈ నెల 7న ఉత్తరాంధ్ర కాపులందరూ పరామర్శించామన్నారు. సీఎం చంద్రబాబు కాపులపై కక్ష సాధిస్తున్నారని ఆ సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారన్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు దుర్భాషలాడటం తగదన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే స్థాయి టీడీపీ మండలాధ్యక్షుడు చించలపు పద్దు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబులకు లేదన్నారు. నాడు వంగవీటి రంగాను, నేడు ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులను కక్ష సాధింపుతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాపులను అణగదొక్కడం కోసమే కేసులు బనాయిస్తున్నారన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మాట తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అనడం అవగాహన రాహిత్యం అన్నారు. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ, సిట్ నిర్ధారించాయన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కాపు నాయకులు వైఎస్సార్‌సీపీ నేతలను విమర్శించడం తగదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే కాపులకు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ నాయకులు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్, గోపాలపట్నం, కేశవరం సర్పంచ్‌లు పన్నీరు బాబ్జి, మేడిశెట్టి రామగోవిందు, ఎంపీటీసీలు కొంతం నరేష్, పల్లేల లక్ష్మణ్, నాయకులు కోనే పుత్రరావు, పాలపర్తి సతీష్, అక్కిరెడ్డి నాగేశ్వరరావు, పెనుమత్య నాగేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, పర్వత సత్యనారాయణ పాల్గొన్నారు.


