చక్కని ప్రణాళిక..
ఇంటర్మీడియట్‌లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యం
పక్కాగా వంద రోజుల ప్రణాళిక అమలు
రోజూ గంట పాటు అదనపు బోధన
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
కోటవురట్ల: జీవితం మలుపునకు మొదటి అడుగు ఇంటర్లోనే.. పదో తరగతిని పదిలంగా దాటేసినా ఇంటర్మీడియట్‌లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం.. ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజనీరు అవ్వాలన్నా, శాస్త్రవేత్తగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే.. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురితప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా, కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా, ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి.
ప్రణాళిక ఇలా..
ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతోపాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్‌ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు రోజూ పరిశీలన, వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.
ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను ఛేదించేందుకు గత పరీక్షా పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యమివ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. చేతిరాతను విద్యార్థులు మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంది.
స్టడీ అవర్స్‌లో విద్యార్థులను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు
కోటవురట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల
ఎంతమంది హాజరవుతున్నారంటే..
అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరంలో జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా, ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాల కోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు.
చక్కని ప్రణాళిక..
చక్కని ప్రణాళిక..


