100 కిలోల గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఒడిశా ఏజెన్సీ ప్రాంతం నుంచి పాడేరు, కె.కోటపాడు మండలం మీదుగా హైదరాబాదుకు కారులో 100 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. మండలంలో కొత్తూరు పంచాయతీ డీఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 4న జిల్లా స్పెషల్ బ్రాంచి ఎస్‌ఐ, కె.కోటపాడు పోలీసులకు కారులో గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం ఇవ్వడంతో అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో కె.కోటపాడు మండలం చల్లవారి కల్లాలు ప్రాంతంలో టాటా సఫారి కారును ఆపి తనిఖీ చేయగా 100 కేజీలు గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగిందన్నారు. కారులోని కర్ణాటకకు చెందిన డ్రైవర్ అబ్దుల్ హాకీమ్, తెలంగాణకు చెందిన మరో డ్రైవర్ సయ్యద్ సమీర్ ఆలీలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇద్దరు డ్రైవర్లు హైదరాబాద్ నుంచి ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు ఈనెల 3వ తేదీన వెళ్లి అక్కడ గంజాయిని సేకరించి, దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం, నర్సీపట్నం మండలం మీదుగా హైదరబాద్ రవాణా చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. కారుతో పాటు గంజాయిని, వారి వద్ద మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. సమావేశంలో కె. కోటపాడు ఇన్‌ఛార్జ్ సీఐ పి.అప్పలరాజు, కె.కోటపాడు ఎస్‌ఐ ఆర్.ధనంజయ్ పాల్గొన్నారు.


