వివాహిత ఆత్మహత్య
మృతురాలు సంతోషి
మునగపాక : మండలంలోని నాగులాపల్లి జగనన్న కాలనీలో వివాహిత గురువారం ఆత్యహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. నాగులాపల్లి జగనన్న కాలనీలో ఉంటున్న ఆళ్ల ఆదినారాయణతో మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన సంతోషికుమారితో 2012లో వివాహం జరిగింది. వివాహ సమయంలో సంతోషి తల్లితండ్రులు అనుకున్న ప్రకారం కట్నకానుకలు అందించారు. ఇరువురు దంపతులు అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ అల్పాహారం తీసుకున్నారు. ఆదినారాయణ తన కుమారుడు చదువుకుంటున్న నాగులాపల్లి హైస్కూల్‌కు బైక్‌పై తీసుకువెళ్లి కూరగాయలు కొనుక్కొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆదినారాయణ తలుపులు తీయాలని తన భార్య సంతోషిని పిలుస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి గునపాంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఫ్యాన్‌కు చీర ఉరివేసుకొని విగతజీవిగా కిందపడి ఉంది. కొన ఊపిరితో ఉన్న సంతోషిని గమనించి ఆటోలో అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సంతోషి మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలు సంతోషికి పాప,బాబు ఉన్నారు. పాప పాటిపల్లి మోడల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుకుంటుంది. అలాగే బాబు నాగులాపల్లిలో అయిదో తరగతి చదువుకుంటున్నారు. కాగా సంతోషి మృతికి అదనపు కట్నంతో పాటు భర్త వేధింపులే కారణమని, ఈ విషయమై తగు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.


