వాహనాల విధ్వంసం కేసులో హైదరాబాద్ యువకుడి అరెస్ట్
యలమంచిలి రూరల్ : గతేడాది డిసెంబరు 9వ తేదీ రాత్రి పట్టణానికి సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాయం ఆవరణలో నిలిపి ఉంచిన ఆటో, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసి వీరంగం సృష్టించిన కేసులో నిందితుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు పట్టణ ఎస్‌ఐ కె.సావిత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గండిమైసమ్మ గుడి సమీపంలో ఉన్న బహదూర్‌పల్లికి చెందిన తొర్రి కార్తీక్ (23) సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన యలమంచిలికి చెందిన యువతి కోసం గత డిసెంబరు 9వ తేదీన యలమంచిలి వచ్చాడు. యువతి నివాసముంటున్న టిడ్కో కాలనీ వద్దకు వెళ్లిన యువకుడితో యువతి మాట్లాడేందుకు నిరాకరించించి. దీంతో ఉన్మాదిగా మారిన నిందితుడు కాలనీలో నివాస గృహాల వద్ద నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడ్నుంచి హైదరాబాదుకు పరారయ్యాడు. ఈ ఘటనపై కాలనీ వాసులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నిందితుడు కార్తీక్‌ను అరెస్ట్ చేయడానికి పట్టణ ఎస్‌ఐ ఒక ప్రత్యేక బృందాన్ని హైదరాబాదుకు పంపించారు. అక్కడ అదుపులోకి తీసుకున్న యువకుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసి యలమంచిలి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.


