రోడ్డు ప్రమాదంలో మాజీ వార్డు సభ్యుడు మృతి
మునగపాక : స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బీలా లక్ష్మణరావు అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. లక్ష్మణరావు గతంలో పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేసి తన వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అనకాపల్లిలో సొంత పని నిమిత్తం వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారన్న విషయం తెలియడంతో మునగపాక వాసులు ఆవేదనకు గురయ్యారు. అందరితో ఆత్మీయంగా ఉండే లక్ష్మణరావు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. లక్ష్మణరావు భార్య స్రవంతి ఇటీవల శ్రీకాళహస్తి దేవాలయ ట్రస్ట్‌బోర్డు సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటన విషయం తెలిసి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణరావు మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి అదే రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మణరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో మాజీ వార్డు సభ్యుడు మృతి


