అగ్ని పరీక్ష
స్టీరింగ్ ఊడిపోతోంది.. ట్యాంకు నుంచి నీరు కారిపోతోంది.. ఇది పాడేరు అగ్నిమాపక కేంద్రంలోని వాహనం పరిస్థితి..అగ్ని ప్రమాదం జరిగితే ఆర్పేందుకు వెళ్లాల్సిన వాహనమే ఇప్పుడు ప్రమాదంలో ఉంది. జిల్లా కేంద్రమైన పాడేరులో అగ్నిమాపక సేవల పరిస్థితి దారుణంగా మారాయి. వంద కిలోమీటర్ల పరిధి.. వేల కోట్ల విలువైన విద్యుత్ ప్రాజెక్టులు.. కానీ రక్షణకు ఉన్నది మాత్రం ఒకే ఒక్క డొక్కు వాహనం. దీంతో సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తుంటే, అధికారులు మాత్రం కొత్త వాహనాల హామీని గాలికొదిలేశారు
అక్కడికి చేరడమే గగనం
● సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులోని అగ్నిమాపక కేంద్రం సేవల విస్తరణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. గత ఏడాది కాలంగా ఇక్కడి పాత అగ్ని మాపక వాహనం మరమ్మతులకు గురై పూర్తిగా మూలకు చేరింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మరో వాహనం కూడా శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రమాదకరంగా వాహన పరిస్థితి
ప్రస్తుతం వినియోగిస్తున్న వాహనం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. వాహన వేగం గంటకు 40 కిలోమీటర్లు దాటితే అందులో కూర్చోవడానికే సిబ్బంది భయపడుతున్నారు. గతంలో ప్రయాణంలో ఉండగానే స్టీరింగ్ ఊడిపోయిన సందర్భాలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా, వాహన ట్యాంకుకు రంధ్రాలు పడటంతో నీరు వృథాగా లీకవుతోంది. దీనివల్ల ప్రమాద స్థలానికి చేరుకునే సరికి ట్యాంకు ఖాళీ అయిపోతుండటంతో అగ్నిమాపక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
● జిల్లాలోని 11 మండలాల్లో ఎక్కడ అగ్ని ప్రమాదం సంభవించినా పాడేరులోని ఈ ఒక్క డొక్కు వాహనమే దిక్కవుతోంది. పాడేరు నుంచి అనంతగిరి, ముంచంగిపుట్టు, గూడెకొత్తవీధి, కొయ్యూరు వంటి మండలాలు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వాహనం కండిషన్‌లో లేకపోవడం వల్ల సుదూర ప్రాంతాలకు సకాలంలో చేరుకోలేకపోతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వెళ్లేలోపే ఆస్తిపాస్తులు, గడ్డి వాములు, పంట కుప్పలు కాలి బూడిదవుతున్నాయి.
● పాత వాహనాల స్థానంలో రెండు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని అధికారులు గత ఏడాదే ప్రకటించినా, అది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఒక వాహనం పూర్తిగా పాడైపోవడం, రెండో వాహనం నీటి లీకేజీతో ఇబ్బంది పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ పాత వాహనంతోనే విధులు నిర్వహిస్తున్నారు. తక్షణమే స్పందించి పాడేరు కేంద్రానికి కొత్త అగ్నిమాపక వాహనాలను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
మార్చిలో కొనుగోలు చేస్తాం
పాడేరు అగ్నిమాపక కేంద్రంలో రెండు వాహనాల మరమ్మతులకు గురయ్యాయి. వీటిని పరిస్థితిని ఉన్నతాధికారులకు నివేదించాం.15వ ఆర్థిక సంఘ నిధులతో కొత్త వాహనాన్ని మార్చిలో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొత్త వాహన సేవలు అందుబాటులోకి వస్తే చాలవరకు ఇబ్బందులు తప్పుతాయి.
– లక్ష్మణస్వామి, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి, పాడేరు
కొత్త వాహనాలు అవసరం
పాడేరు అగ్నిమాపక కేంద్రంలో రెండు వాహనాల సేవలను అందుబాటులో ఉంచాలి.గిరిజన ప్రాంతాలలో వేసవి కాలం వస్తే అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి.గత నెలలో హుకుంపేట మండలంలో పలు చోట్ల వరిపనల కుప్పలు దహనం అయ్యాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని కొత్త వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
– చెండా ప్రసాద్, గిరిజన రైతు, ములియాపుట్టు, హుకుంపేట మండలం
అగ్ని పరీక్ష
అగ్ని పరీక్ష


