గురువు ముసుగులో మృగం! | - | Sakshi
Sakshi News home page

గురువు ముసుగులో మృగం!

Feb 6 2026 7:40 AM | Updated on Feb 6 2026 7:40 AM

గురువు ముసుగులో మృగం!

గురువు ముసుగులో మృగం!

గురువు అంటే మార్గదర్శిగా ఉండాలి.. కానీ ఆ ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అభం శుభం తెలియని చిన్నారుల పట్ల వికృత చేష్టలకు పాల్పడుతూ మృగంలా ప్రవర్తించాడు. ఆగ్రహించిన తల్లిదండ్రులు అతడికి దేహశుద్ధి చేయగా, అధికారులు విచారణ చేపట్టారు. విద్యా వ్యవస్థకు కళంకం తెచ్చిన ఈ ఘటన కలకలం రేపింది.

పాడేరు: విద్యార్థులకు ప్రాథమిక దశ నుంచే విద్యాబుద్ధులతో పాటు మంచి నడవడికను నేర్పాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ఉపాధ్యాయుడి తీరుతో విసిగిపోయిన విద్యార్థినులు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో, తల్లిదండ్రులు వారిని ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పాడేరు మండలం మారుమూల ఐనాడ పంచాయతీ, రాయిపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ పాఠశాలలో సుబ్రహ్మణ్యం అనే ఉపాధ్యాయుడు కొంతకాలంగా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా ఆయన పాఠశాల విద్యార్థినుల పట్ల వికృత చేష్టలతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది.

తల్లిదండ్రుల ఆగ్రహం..

ఉపాధ్యాయుడి ప్రవర్తనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు బుధవారం ఆయనపై భౌతిక దాడి చేశారు. చిన్నారులను తరచుగా కొట్టడంతో పాటు, అనుచితంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఇన్‌చార్జి ఎంఈవో సువర్ణరాజు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన, గురువారం పాఠశాలను సందర్శించి విచారణ జరిపారు. జరిగిన తీరును తల్లిదండ్రులు ఎంఈవోకు వివరించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, నివేదికను కలెక్టర్‌, డీఈవోకు సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ ఉపాధ్యాయుడిని వేరే చోటుకు బదిలీ చేస్తామని పేర్కొన్నారు.

ఆందోళన.. డిమాండ్లు

మరోవైపు గురువారం పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు, సర్పంచ్‌, ఎంపీటీసీలు ఆందోళన చేపట్టారు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న సుబ్రహ్మణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అతడిని ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఐటీడీఏ, కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఆరోపణలు అవాస్తవం

అయితే, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కక్షగట్టి తన భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారని, 2023 నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్న తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనపై గ్రామానికి చెందిన కొంతమంది భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన వాపోయారు.

రాయిపాలెం ఎంపీపీ పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్య ప్రవర్తన

పాఠశాలకు వెళ్లకపోవడంతో

ఆరా తీసిన తల్లిదండ్రులు

వెలుగులోకి అసలు విషయం

ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యంకు

దేహశుద్ధి

విచారణ చేపట్టిన ఇన్‌చార్జి

ఎంఈవో సువర్ణరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement