‘ఉపాధి’ వేతనం పెంచాలని ఆందోళన
ముంచంగిపుట్టు: ఉపాధి హామీ నిధులు పెంచాలని, బకాయి పడిన గృహ నిర్మాణ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గురువారం గిరిజనులు ఆందోళనకు దిగారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చకూడదని, నిధుల కుదింపు వల్ల గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళనకారులు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేసి, పనిదినాలను 200 రోజులకు పెంచాలని, రోజువారీ వేతనం రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.పీఎం జన్–మన్, జనరల్ కేటగిరీ ఇళ్లకు ప్రస్తుత ధరలకు అనుగుణంగా యూనిట్ ధరను రూ.10 లక్షలకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి కె. త్రినాథ్ మాట్లాడుతూ.. లబ్ధిదారులకు న్యాయం జరగకుంటే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ భాస్కర అప్పారావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సత్యనారాయణ, సీపీఎం మండల నేతలు ఎంఎం శ్రీను, కె. నర్సయ్య, ఎస్. గాసిరాం దొర, జి. నారాయణ, పి. రామదాసు, కె. శంకర్ రావు, జి. జినబంధు, డొంబ్రు, శ్రీను, నీలకంఠం, దేవ, పరశురామ్ పాల్గొన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో గిరిజనుల డిమాండ్


