పోటీపరీక్షల్లో విజయం సాధించేందుకే ‘సంకల్పం’
● ఎస్పీ అమిత్ బర్దర్
● ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్రారంభం
అరకులోయ టౌన్: యువతలో విద్యపై అవగాహన పెంచడానికి, పోటీ పరీక్షల్లో విజయం సాధించేలా ప్రోత్సహించడానికి ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ఎంతో దోహదపడుతుందని ఎస్పీ అమిత్ బర్డర్ అన్నారు. కాకినాడలోని శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరకులోయలో గిరిజన యువత కోసం ఏర్పాటు చేసిన ‘సంకల్పం’ ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అరకులోయ మండలంలోని యువతీ యువకులు పోలీస్, ఎస్‌ఐ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా ఈ శిక్షణ రూపొందించబడిందన్నారు. గిరిజన యువతలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, సమాజంలో వారు ఉన్నత స్థానాలకు చేరుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.నిపుణులైన అధ్యాపకుల ద్వారా నాణ్యమైన విద్యా సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ ఈ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులో ఉంటాయన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పట్టుదలతో చదివి జీవితంలో స్థిరపడాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ మాట్లాడుతూ.. యువత చదువు పట్ల అనాసక్తి చూపకుండా, నిరంతరం శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను తప్పక సాధిస్తారని పేర్కొన్నారు. శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గిరిజన యువత అభివృద్ధి కోసం పోలీస్ శాఖ తీసుకున్న ఈ చొరవ అభినందనీయమన్నారు. పోలీస్ శాఖ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, విద్యార్థులకు అత్యుత్తమ కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, అరకులోయ ఎస్‌ఐ గోపాలరావు, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.


