12న పర్యాటక ప్రాంతాల్లో బంద్
అరకులోయ టౌన్: ఈ నెల 12వ తేదీ గురువారం అరకులోయలోని పర్యాటక సందర్శిత ప్రాంతాల బంద్‌కు సీఐటీయూ పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మిక, రైతు సంఘాలు సంయుక్తంగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో భాగంగా పాడేరు ఐటీడీఏ పరిధిలోని పర్యాటక ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొంటారని ఐటీడీఏ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దాడి రాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భగత్ రామ్ తెలిపారు.ఇప్పటికే సంబంధిత యూనిట్ మేనేజర్లకు సమ్మె నోటీసులు అందజేశామన్నారు. ఈనెల 12న అరకులోయలోని అన్ని పర్యాటక ప్రాంతాలు మూతబడతాయని, ఈ విషయాన్ని సందర్శకులు గుర్తించాలని వారు కోరారు.
విజయవంతం చేయాలని సీఐటీయూ పిలుపు


