అగ్నిప్రమాదంలో రైతు మృతి
మాడుగుల రూరల్: చలిమంట కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పశువుల పాక దగ్ధంకాగా, అందులో నిద్రించిన రైతు తీవ్రంగా గాయపడి కేజీహెచ్‌లో మృతిచెందాడు. రెండు పాడి గేదెలు గాయపడ్డాయి. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో జంపెన నుంచి గాదిరాయి వెళ్లే రహదారిలో జంపెన గ్రామానికి చెందిన రైతు ధర్మిశెట్టి అచ్చిమినాయుడు(40)కు చెందిన పశువుల పాక ఉంది. ఈ పాకలో రెండు పాడి గేదెలు, ఒక బైక్ ఉన్నాయి. మంగళవారం రాత్రి పశువుల పాకలో అచ్చిమినాయుడు చలిమంట వేసుకున్నాడు. దానిని ఆర్పకుండా పాకలో నిద్రపోయాడు. దీంతో బుధవారం తెల్లవారు జామున నిప్పు అంటుకుని పాక దగ్ధమైంది. నిద్రమత్తులో ఉన్న అచ్చిమినాయుడు లేచి చూసేసరికి పాక అంతా మంటలు వ్యాపించాయి. గేదెలను రక్షించే ప్రయత్నంలో ఉండగా ఒక్క సారిగా కాలుతున్న దూలం అచ్చిమినాయుడు మీద పడి, 70 శాతం శరీరం కాలిపోయింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందదుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక గేదె స్వల్పంగా, మరో గేదె 50 శాతం కాలినగాయాలకు గురయ్యాయి. పాకలో ఉన్న బైక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న మాడుగుల అగ్నిమాపక కేంద్రం అధికారి వి.రాజేశ్వరావు తన సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారి తెలిపారు.
పెద్ద దిక్కును కోల్పోయాం
అగ్నిప్రమాదం కారణంగా పెద్దను కోల్పోయామని, మృతుడు అచ్చిమినాయుడు భార్య దుర్గ, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడికి ఒక కుమారై, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నిప్రమాదంలో రైతు మృతి
అగ్నిప్రమాదంలో రైతు మృతి


