స్ట్రాబెర్రీ | - | Sakshi
Sakshi News home page

స్ట్రాబెర్రీ

Feb 5 2026 7:30 AM | Updated on Feb 5 2026 7:30 AM

స్ట్ర

స్ట్రాబెర్రీ

ప్రకృతి ఒడిలో కురుస్తున్న దట్టమైన మంచు కేవలం పర్యాటకులకే కాదు, లంబసింగి రైతులకు కూడా కొత్త వెలుగులు తీసుకొచ్చింది. ఈ ఏడాది హిమబిందువుల మధ్య చేపట్టిన స్ట్రాబెర్రీ సాగుకు వాతావరణంఅనుకూలించడంతో మంచి దిగుబడి వచ్చింది. అటు ప్రకృతి అందం, ఇటు ఆర్థిక లాభం జతకలవడంతో ఏజెన్సీ రైతుల ఇంట స్ట్రాబెర్రీ తీపి కనిపిస్తోంది.
గిరి రైతు గురి

చింతపల్లి: ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగి ప్రాంతం ఇప్పుడు విదేశీ పంటలకు కేంద్రంగా మారుతోంది. చలి తీవ్రత అధికంగా ఉండే ఈ ప్రాంతంలో గిరిజన రైతులు సంప్రదాయేతర పంట అయిన ’స్ట్రాబెర్రీ’ సాగులో అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఉత్తర భారతదేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌, కశ్మీర్‌, ఊటీ, మహాబలేశ్వర్‌ వంటి ప్రాంతాలకే పరిమితమైన ఈ పంట, ఇప్పుడు లంబసింగిలో కూడా విరివిగా పండుతుండటం విశేషం.

సాగు ప్రస్థానమిలా..

సుమారు 30 ఏళ్ల క్రితం చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ఇక్కడ స్ట్రాబెర్రీ సాగుపై ప్రయోగాలు చేపట్టారు. వారి సూచనల మేరకు గొందిపాకలు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు బౌడు కుశలవుడు ప్రయోగాత్మకంగా సాగు మొదలుపెట్టారు. పూణే (మహాబలేశ్వర్‌) నుంచి కామరోజా అనే రకాన్ని తీసుకువచ్చి, ఎకరాలో 20 వేల మొక్కలతో సాగుకు శ్రీకారం చుట్టారు. ఆయన సాధించిన ఫలితాలను ఆదర్శంగా తీసుకుని నేడు అనేకమంది రైతులు దీనిని అనుసరిస్తున్నారు.

● ప్రస్తుతం లంబసింగి, రాజుపాకలు, గొందిపాకలు, రాజబంద, తాజంగి, లబ్బంగి, సిరిపురం, చెలకవీధి తదితర గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో ఈ సాగు విస్తరించింది. ప్రారంభంలో సాగు చేసిన రకాల కంటే, ప్రస్తుతం ఈ ప్రాంత వాతావరణానికి అత్యంత అనుకూలమైన ’వింటర్‌ డాన్‌’ రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. రబీ సీజన్‌లో భాగంగా సాగయ్యే ఈ పంట, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే నాలుగు నుంచి ఐదు నెలల పాటు దిగుబడి ఇస్తుంది.

● ఎకరా సాగుకు సుమారు 20 వేల మొక్కలు అవసరమవుతాయి. మొక్కల కొనుగోలు, రవాణా, సాగు ఖర్చులు కలిపి ఎకరాకు సుమారు రూ. 3 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది. ఒక్కో మొక్క నుంచి 300 నుంచి 500 గ్రాముల వరకు దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. మైదాన ప్రాంత రైతులు సైతం ఇక్కడికి వచ్చి, గిరిజనుల భూములను కౌలుకు తీసుకుని మరీ సాగు చేపడుతుండటం ఈ పంట లాభదాయకతకు నిదర్శనం.

● లంబసింగి పర్యాటక ప్రాంతం కావడంతో మార్కెటింగ్‌ సమస్యే లేదు. పండించిన పంటలో 90 శాతం ఇక్కడికి వచ్చే పర్యాటకులకే అమ్ముడుపోతోంది. తాజా స్ట్రాబెర్రీ పండ్లను పర్యాటకులు హాట్‌ కేకుల్లా కొనుగోలు చేస్తున్నారు. 250 గ్రాములు (సుమారు 15–20 పండ్లు) ఉండే బాక్స్‌ను రూ. 100 నుంచి రూ. 120 వరకు విక్రయిస్తున్నారు.

జామ్‌ తయారీ

పండ్లే కాకుండా, స్ట్రాబెర్రీ జామ్‌ను కూడా తయారు చేసి 100–200 గ్రాముల బాక్సులను రూ. 150 నుంచి రూ. 200 వరకు విక్రయిస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు పెట్టుబడి పోను రూ. 8లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు తెలిపారు. ఈ ఏడాది వర్షాల వల్ల సాగు కాస్త ఆలస్యమైనప్పటికీ, వాతావరణం అనుకూలించిందని, గత మూడేళ్లతో పోలిస్తే మంచి దిగుబడులు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంచి దిగుబడులు సాధిస్తున్న

లంబసింగి రైతులు

నోరూరించే రుచితోపాటు లాభాలు

ఎకరాకు రూ.8 లక్షల ఆదాయం

కాసులు కురిపిస్తున్న పైరు

స్ట్రాబెర్రీ1
1/4

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ2
2/4

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ3
3/4

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ4
4/4

స్ట్రాబెర్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement