ట్రాలీ ఢీకొని రైల్వే గేటు ధ్వంసం
డుంబ్రిగుడ: మండలంలోని కురిడి పంచాయితీ కేంద్రం సమీపంలో ఉన్న రైల్వే గేటు వద్ద బుధవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఒక భారీ ట్రాలీ అదుపుతప్పి రైల్వే గేటును ఢీకొట్టింది. ఆ సమయంలో గేటు మూసి ఉండటంతో, అక్కడ నిలిపి ఉంచిన స్కూటీపైకి ట్రాలీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో స్కూటీ పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.అదే సమయంలో ఒక గూడ్స్ రైలు నెమ్మదిగా వస్తూ పట్టాలపై ఉన్న ట్రాలీని గమనించి సకాలంలో ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదం ధాటికి రైల్వే గేటు పూర్తిగా విరిగిపోవడం, ట్రాలీ పట్టాలపైనే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనివల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, బస్సుల్లో ప్రయాణించే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత్యంతరం లేక ప్రయాణికులు గేటు దాటి అవతలి వైపునకు వెళ్లి ఆటోల్లో ప్రయాణించాల్సి వచ్చింది. ట్రాలీ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు సుమారు గంటపాటు శ్రమించి ట్రాలీని తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
గూడ్సు రైలు నిలిపివేయడంతో
తప్పిన పెద్ద ప్రమాదం
ట్రాలీ ఢీకొని రైల్వే గేటు ధ్వంసం


