గిరిజన విద్యార్థులకుడిజిటల్ విద్య
● కలెక్టర్ దినేష్‌కుమార్
పాడేరు : గిరిజన ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ దినేష్‌కుమార్ అన్నారు. మండలంలోని గుత్తులపుట్టు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో డిజిటల్ తరగతి గదులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఆరోహణ స్వచ్ఛంద సంస్థ, ఐఆర్‌సీటీసీ సీఎస్సార్ నిధులతో జిల్లాలోని లోచలిపుట్టు, గుత్తులపుట్టు, బొర్రా, టోకూరులో ఒక్కో పాఠశాలకు 15 కంప్యూటర్ల చొప్పున అందజేశారన్నారు. విద్యార్థులు డిజిటల్ తరగతి గదులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోహణ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు రాణి పాటిల్, టీడబ్ల్యూ డీడీ పరిమళ పాల్గొన్నారు.
జిల్లా పర్యాటకాభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు
అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. టూరిజం అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ, పంచాయతీరాజ్, అటవీశాఖ, పరిశ్రమల శాఖ మూడు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. హోం స్టేలను అభివృద్ధి చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ శాఖ బాధ్యత తీసుకోవాలన్నారు. పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగా స్థానిక గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ, పర్యాటక అభివృద్ధి సంస్థ రీజనల్ డైరెక్టర్ కల్యాణి, డివిజనల్ మేనేజర్ జగదీష్, జిల్లా పర్యాటక శాఖ అధికారి దాసు పాల్గొన్నారు.


