కాఫీ రైతులకు గిట్టుబాటు ధర
జి.మాడుగుల: గిరిజన సహకార సంస్థకు రైతులు కాఫీ విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆసంస్థ కాఫీ విభాగం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ కోరారు. మండలంలో పీజీ మాడుగుల, గొడుగుమామిడి, కుబ్బంగి తదితర గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. గిరిజన గ్రామాల్లో కాఫీ దిగుబడుల వివరాలను రైతుల నుంచి తెలుసుకున్నారు. రైతులు కాఫీని దళారీలకు విక్రయించి మోసపోవద్దని ఆయన సూచించారు. గిరిజన సహకార సంస్ధ ద్వారా పాచ్‌మెంట్ కాఫీ కిలో రూ.450, చెర్రీ కిలో రూ.270 చొప్పున ధర చెల్లిస్తున్నట్టు ఆయన వివరించారు. గిరిజన రైతులకు జీసీసీ మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తుందన్నారు. అందువల్ల రైతులు తమ సంస్థకు విక్రయించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బాబూరావు, సేల్స్‌మెన్లు కోటిబాబు, పంతులుబాబు, సూరిబాబు,నిరీక్షణరావు పాల్గొన్నారు.
జీసీసీ కాఫీ విభాగం జీఎం శ్రీనివాస్


