ఘనంగా శ్రీ గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు ప్రారంభం
రోలుగుంట: నాలుగురోజుల పాటు నిర్వహించే గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆచార సంప్రదాయం ప్రకారం బుడబుక్కల వేషం నిర్వహించారు. తరువాత సాయంత్రం వరకూ యువకులు ఉత్సాహంగా బాలనాగమ్మ, తిక్కలోడు వంటి పలు వేషాలు ప్రదర్శించారు. సాయంత్రం 4:30 గంటల తరువాత ముందుగా వెదురు కలపతో నిర్మించిన 90 అడుగుల బండి ప్రభను భక్తులు భుజాలపై ఉత్సవస్థలానికి మోసుకుని వచ్చి శుభ ఘడియలో ప్రతిష్టించారు. గ్రామ వీధులను రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించారు. రాత్రి శూలాలు ఉత్సవాన్ని నిర్వహించారు. తరువాత ఉత్సవ స్థలానికి తీసుకువచ్చి ఉత్సవమూర్తులను భక్తుల దర్శనార్థం రథంపై ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ పోతల లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ గురువారం చిన్న తీర్థం, శుక్రవారం పెద తీర్థం జరుగుతుందన్నారు. గ్రామ వీధుల్లో స్టేజి ప్రోగాంలు ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం నిమజ్జనోత్సవం జరుగుతుందన్నారు. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా వెదురుతో నిర్మించిన 90 అడుగుల బండిప్రభ ప్రతిష్ట ప్రత్యేకాకర్షణగా ఉంటుందన్నారు. ఏ విధమైన ఆల్లర్లకు తావు లేకుండా గ్రామ యవత వలంటీర్లుగా తమ సహకారం అందించాలని కోరారు. అలాగే ఉత్సవం విజయవంతానికి పోలీసులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.


