మరింత మెరుగ్గా పోలీసుల నైపుణ్యాలు
ఆరిలోవ(విశాఖ తూర్పు): పోలీసులు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ సూచించారు. విశాఖ నగరంలోని కై లాసగిరి ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ పోలీస్ కార్యాలయంలో పోలీసులకు వార్షిక మొబిలైజేషన్ రీఫ్రెష్ ట్రైనింగ్ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకునే ఈ శిక్షణ 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సిబ్బందికి క్రమశిక్షణపై ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. పోలీసులకు విధుల్లో ఒత్తిడి సహజమన్నారు. ఇలాంటి రీఫ్రెష్ శిక్షణ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతోపాటు వారి కుటుంబ సంక్షేమం, పిల్లల చదువుల విషయంపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐలు బి.రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు, ఆర్‌ఎస్‌ఐ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.


