శతశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ
తుమ్మపాల : ప్రతి ఇంటి నుంచి వారానికి కనీసం రెండుసార్లు చెత్త సేకరణ చేపట్టి పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఈ నెల 15 నాటికి గ్రామాల్లో శతశాతం ఇంటిపన్నులు వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. పట్టణంలో న్యూకాలనీలో గల ఫంక్షన్ హాలులో మంగళవారం ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, సచివాలయాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వర్మీ కంపోస్టులు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. ఇంటిపన్నుల వసూలు లక్ష్యంగా పెట్టుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అంతకుముందు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డిప్యూటీ ఎంపీడీవోలు డి.రాము, ఎం.సోమరాజు, జి.కోటేశ్వరరావు, జె.దుర్గా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు ఎ.శైలజారత్నం, కె.యరయ్యమ్మ, వై.శ్రీనివాస్‌లకు సేవా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఈ. సందీప్, జిల్లా అభివృద్ధి అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి ఎస్.మంజులవాణి, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.


