సమస్యలు పరిష్కరించాలని 104 ఉద్యోగుల నిరసన
● స్పందించకుంటే ఉద్యమం ఉధృతం ● ప్రభుత్వానికి హెచ్చరిక
పాడేరులో ఐటీడీఏ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలుపుతున్న 104 ఉద్యోగులు
పాడేరు : రాష్ట్ర వ్యాప్తంగా 104 సర్వీసుల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను పరిష్కారించకుంటే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సిఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. 104 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం ఐటీడీఏ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో తొలగించిన సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని, భవ్య యాజమాన్యం ఉద్యోగులపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కనీస వేతనాలు అమలు చేయాలని, వేధింపులు ఆపాలని, వేతనాలను పెంచాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 104 ఉద్యోగుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి మాట్లాడుతూ ఉద్యోగులకు ఏడాదికి 15 క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, ప్లే, సిప్పులు ఐటీ కార్డులు అందజేయాలని, చిన్నపాటి కారణాలతో తొలగించిన 104 సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సకాలంలో సమస్యలు పరిష్కరించకకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందర్‌రావు, మండల కన్వీనర్ ప్రసాద్, 104 సిబ్బంది పాల్గొన్నారు.


