కార్మిక చట్టాల రద్దు దేశ ద్రోహమే..
సీతంపేట: పార్లమెంట్‌లో సీపీఐ ఎంపీల ఒత్తిడి ఫలితంగా దేశంలో భారీ పరిశ్రమల ఏర్పాటు, కార్మిక చట్టాల రూపకల్పన జరిగాయని, వాటిని నాశనం చేసే దిశగా మోదీ పాలన సాగుతోందని ప్రపంచ కార్మిక సమాఖ్య ఉప ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి శ్రీకుమార్ మండిపడ్డారు. సీపీఐ శత వార్షికోత్సవాలు పురస్కరించుకుని ద్వారకానగర్ పౌరగ్రంథాలయంలో మంగళవారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ వారితో పోరాడి సాధించిన కార్మిక చట్టాలన్నింటినీ ఒక్క కలం పోటుతో రద్దు చేసి, కేవలం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చివేశారని మండిపడ్డారు. దేశ ఆర్థిక పటిష్టత, సంపద సృష్టి కోసం నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలు స్టీలు, బొగ్గు, రక్షణ, బ్యాంకు, బీమా, రవాణా, రైల్వే, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో అదానీ, అంబానీలకు ప్రధాని మోదీ కట్టబెట్టడం దేశ ద్రోహమని దుయ్యబట్టారు. సీపీఐ ఎంపీలు పోరాడి ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేస్తే.. మోదీ వాటిని ప్రైవేట్‌పరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంలో 15 లక్షలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 7 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని నింపకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉపాధి లేకుండా చేశారన్నారు. పదేళ్లుగా లేబర్ కాన్ఫరెన్స్ పెట్టకుండా శ్రామిక శక్తిని మోదీ అవమానపర్చారన్నారు. ఈ నెల 26న జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ లౌకిక వాదాన్ని మోదీ తుంగలో తొక్కి రాజ్యాంగ హక్కులు కాలరాస్తున్నారని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నించే వారిపై తుపాకీ ఎక్కుపెట్టి.. గిరిజనుల హక్కులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కగార్‌తో బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుతరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజాన దొరబాబు, ఎం.మన్మధరావు, బూసి వెంకటరావు, కె.సత్యాంజనేయ, జె.డి.నాయుడు, వామనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి శ్రీకుమార్


