జాతీయ స్థాయి ఆర్చరీపోటీలకు గిరిజన విద్యార్థి
పాడేరు : జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఓ గిరిజన విద్యార్థి ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయనకు జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ ఆర్థిక సహాయం అందజేశారు. హుకుంపేట మండలం శోభకోట పంచాయతీకి చెందిన వంతాల లలిత్‌సాయితేజ అరకు ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతూ ఆర్చరీలో తర్ఫీదు పొందుతున్నాడు. ఇటీవల రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ ఆర్చరీ విభాగంలో పాల్గొని సత్తా చాటాడు. ఈ నెల 30 నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో సబ్ జూనియర్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో విద్యార్థితో పాటు స్పోర్ట్స్ స్కూల్ యాజమన్యాన్ని అభినందించి కలెక్టర్ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చూపి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆకాక్షించారు.


