మాయమయ్యేది కాదు
రోగనిరోధక శక్తి తగ్గితే పొంచి ఉన్న ముప్పు విశాఖలో పెరుగుతున్న షింగిల్స్ బాధితులు 50 ఏళ్లు దాటిన వారికి హెచ్చరిక
మంత్రం వేస్తే
ఏయూక్యాంపస్: వయసు పెరిగేకొద్ది మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గడం సహజం. ఈ క్రమంలో కొన్ని రకాల వైరస్‌లు మన శరీరంపై దాడి చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది, అత్యంత బాధాకరమైనది ‘షింగిల్స్’. దీనిని వైద్య పరిభాషలో ‘హెర్పెస్ జోస్టర్’అని, తెలుగులో సాధారణంగా ‘సర్పి’అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. సకాలంలో స్పందిస్తే దీని నుంచి త్వరగా ఉపశమనం పొందే అవకాశం ఉంది.
తిరగబెడుతున్న పాత వైరస్
చిన్నతనంలో వచ్చే ‘చికెన్ పాక్స్’(అమ్మవారు) తగ్గిన తర్వాత, ఆ వైరస్(వరిసెల్లా జోస్టర్) మన శరీరంలోని నరాల మూలాల్లో నిద్రాణంగా ఉండిపోతుంది. వయసు పెరిగిన తర్వాత లేదా రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ వైరస్ తిరిగి క్రియాశీలకమై ‘షింగిల్స్’ రూపంలో బయటపడుతుంది. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అయితే జీవనశైలి మార్పుల వల్ల ఇటీవల యువతలో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి.
అపోహలు.. అనర్థాలు
గ్రామీణ ప్రాంతాల్లో దీనిని ‘సర్పి’గా పిలుస్తూ.. మంత్రం వేస్తే లేదా పసరు రాస్తే తగ్గుతుందనే అపోహ ప్రజల్లో ఉంది. మంత్రాల పేరుతో కాలయాపన చేయడం వల్ల వైరస్ నరాలను దెబ్బతీసి, పరిస్థితిని విషమించేలా చేస్తుంది. సకాలంలో వైద్యుని సంప్రదించకపోతే చర్మంపై తీవ్రమైన గాయాలు ఏర్పడటమే కాకుండా, ఇన్ఫెక్షన్ పెరిగే ప్రమాదం ఉంది. కంటి దగ్గర షింగిల్స్ వస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. మెదడువాపు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు. తీవ్రమైన నొప్పి కారణంగా నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. దద్దుర్లు తగ్గినప్పటికీ, నరాలు దెబ్బతినడం వల్ల నెలల తరబడి, కొన్నిసార్లు ఏళ్ల తరబడి తీవ్రమైన నొప్పి వేధిస్తుంది. క్యాన్సర్ రోగులు, స్టెరాయిడ్స్ వాడేవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్న పిల్లలు కూడా దీని బారిన పడే అవకాశం ఉంది. అయితే వృద్ధులతో పోలిస్తే యువతలో దీని తీవ్రత కొంత తక్కువగా ఉంటుంది.
పెరుగుతున్న బాధితులు
ఇటీవల నగరంలో షింగిల్స్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రస్తుత శీతాకాల వాతావరణం వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉండటం, చర్మం పొడిబారడం వంటి కారణాల వల్ల బాధితులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ముఖం, వీపు, ఛాతీ లేదా పొట్ట భాగంలో ఎర్రటి దద్దుర్లు, నీటితో కూడిన పొక్కులు రావడం ఈ వ్యాధి లక్షణాలు.
ఈ పొక్కులు శరీరానికి ఒక వైపు మాత్రమే గుంపుగా వస్తాయి. తీవ్రమైన మంట, పొడిచినట్లుగా నొప్పి ఉంటుంది. జ్వరం, తలనొప్పి, అలసట ఉండవచ్చు.
టీకాతోనే రక్షణ
షింగిల్స్‌ను యాంటీ వైరల్ మందులతో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే, వ్యాధి రాకుండా చూసుకోవడమే ఉత్తమం. దీని కోసం ఎఫ్‌డీఏ ఆమోదించిన టీకాలు అందుబాటులో ఉన్నాయి. 50 ఏళ్లు నిండిన వారు వైద్యుల సలహా మేరకు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒక నెల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవడం ద్వారా దాదాపు 10 ఏళ్ల వరకు షింగిల్స్ నుంచి రక్షణ లభిస్తుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం వల్ల నరాల నొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యలను నివారించవచ్చు. ప్రజలు మూఢనమ్మకాలను వీడి, శాసీ్త్రయ వైద్య విధానాలను అనుసరించాలి. దీనిపై మరింత విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ కె.వెంకటాచలం,
అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర డెర్మటాలజిస్ట్ అసోసియేషన్
మాయమయ్యేది కాదు
మాయమయ్యేది కాదు


