
పోలవరం నిర్వాసిత గిరిజనులకు ప్రత్యామ్నాయ భూములు
పాడేరు : పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న గిరిజనులకు ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాల్సిందేనని కలెక్టర్ దినేష్‌కుమార్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆయన రంపచోడవరం, చింతూరు డివిజన్ అధికారులు, తహసీల్దార్లు, పోలవరం పరిపాలన అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రైతులకు ప్రత్యామ్నాయ భూముల సేకరణ, పునరావాసం, ఏర్పాట్లపై సమీక్షించిన అనంతరం మాట్లాడారు. భూ సేకరణ కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. పునరావాస కాలనీలకు ప్రజలను తరలించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల తాను వరద ముంపు ప్రభావిత గ్రామాల్లో పర్యటించినప్పుడు పునరావావ కాలనీల్లో విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రజలు తన దృష్టికి తెచ్చారన్నారు. పునరావాస కాలనీల్లో తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఇంకా 4500 ఎకరాల భూమిని సమీకరించాలన్నారు. రైతులు వ్యవసాయం చేసేందుకు అనువుగా ఉన్న భూములను గుర్తించాలన్నారు. జీలుగుమిల్లి, బుట్టయ్యగూడెం, కుకునూరు గ్రామాల్లోని భూములు సేకరించాలన్నారు. ఇందుకూరుపేట గ్రామానికి శ్మశానవాటికకు భూమిని సేకరించాలన్నారు. ఈ సమావేశంలో పోలవరం పరిపాలనాధికారి అభిషేక్, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీవోలు సింహాచలం, అపూర్వభరత్, సబ్ కలెక్టర్ శుభం నొఖ్వాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అంబేడ్కర్ పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం