
బ్రహ్మకుమారీల సేవలుఅభినందనీయం
● జాయింట్ కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ అభిషేక్ గౌడ
పాడేరు : మన్యంలో బ్రహ్మకుమారీల( ఓం శాంతి) నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాలు అభినందనీయమని జాయింట్ కలెక్టర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో శనివారం బ్రహ్మకుమారీలు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎంతో విలువైన రక్తదాన శిభిరం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. సామాజిక బాధ్యతగా రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఈ శిబిరంలో 25 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద, సృజనాత్మక అకాడమి చైర్మన్ గంగులయ్య, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు గంగరాజు, గౌరీశంకర్, సూర్యారావు, తదితరులు పాల్గొన్నారు.