
డుడుమ ప్రవాహంలో పర్యాటకుడి గల్లంతు
● ప్రకృతి అందాలను డ్రోన్‌తో
చిత్రీకరిస్తుండగా ప్రమాదం
● వరద నీటిలో కొట్టుకుపోయిన వైనం
● గాలించినా లభ్యం కాని ఆచూకీ
ముంచంగిపుట్టు: ఆంధ్రా– ఒడిశా సరిహద్దులో ఉన్న డుడుమ జలాశయం వద్ద పర్యాటకుడు గల్లంతు అయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని బరంపూర్‌కు చెందిన సాగర్ కుండు (22), కటక్‌కు చెందిన అభిజిత్ బెహరా అనే ఇద్దరు స్నేహితులు శనివారం డుడుమ జలపాతం సందర్శనకు వచ్చారు. అభిజిత్ జలాశయం ఒడ్డున ఫొటోలు తీస్తుండగా, సాగర్‌కుండు డ్రోన్ కెమెరాతో డుడుమ జలాశయం, డుడుమ జలపాతం పరిసర అందాలను నీటిలో దిగి చిత్రీకరిస్తున్నాడు. ఇదే సమయంలో డుడుమ జలాశయ 7వ నంబరు గేటు ఎత్తి 1500 క్యూసెక్కుల వరద నీటిని బలిమెల జలాశయానికి విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రవాహంలో సాగర్ కుండు చిక్కుకుని కొట్టుకుపోయాడు. అతనిని కాపాడేందుకు స్నేహితుడు అభిజిత్, స్థానికులు తాడు సాయంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు సెల్‌ఫోన్‌తో రికార్డు చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వనుగుమ్మ, ఒనకఢిల్లీ, సంగడ గ్రామాల గిరిజనులు, మాచ్‌ఖండ్ ఐఐసీ శాశ్వత్‌భోయి, పోలీసులు, జలాశయ అధికారులు, లంతాపుట్టు అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం మధ్యాహ్నం 2గంటలకు జరిగింది. సాయంత్రం 6గంటల వరకు గాలింపు చేపట్టినా ఎటువంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం మళ్లీ గాలింపు చేపడతామని అధికారులు తెలిపారు.

డుడుమ ప్రవాహంలో పర్యాటకుడి గల్లంతు