వీఆర్‌పురం: గోదావరి, శబరి వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. జీడిగుప్ప, వడ్డిగూడెం, రామవరం, చినమట్టపల్లి, రాజుపేట, శ్రీరామగిరి, తుమ్ములేరు పంచాయతీల పరిధిలోని నాలుగు వేల కుటుంబాలు వరద ప్రభావానికి గురయ్యాయి. ఆయా పంచాయతీల్లో 362 ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. రెండు నదులు శాంతించినా చింతరేవుపల్లి, గుండుగూడెం, పత్తిపాక, తుష్టివారిగూడెం గ్రామాలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. రహదారులు ముంపులో ఉన్నందున ఆయా గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
● ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వరద ప్రభావానికి గురైన కుటుంబాలు వాపోతున్నాయి . కొన్ని గ్రామాలకు మాత్రం నిత్యావసర సరకులు అందించారు. పప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, మంచినూనె ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరద కారణంగా అన్నివర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం మాత్రం నీట మునిగిన ఇళ్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం సరికాదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊళ్ల చుట్టూ నీరు చేరడంతో బయటకు వచ్చే మార్గం లేక నరకం చూశామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీఆర్‌పురం మండలంలో
4 వేల కుటుంబాలపై వరద ప్రభావం
నీటమునిగిన 362 ఇళ్లు
పూర్తిస్థాయిలో పంపిణీకి నోచుకోని నిత్యావసర సరకులు
దయనీయ స్థితిలో బాధిత ప్రజలు