
విధి నిర్వహణలో ఉన్న వీఆర్వో మృతి
కూనవరం: విధి నిర్వహణలో ఉన్నవీఆర్వో మృతి చెందిన ఘటన మండలంలోని చూచిరేవులగూడెం సచివాలయంలో శనివారం చోటుచేసుకుంది. సహచర ఉద్యోగుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గోదావరి వరదల విధులు ముగించుకొని చూచిరేవులగూడెం వీఆర్వో పండా అనోజు కుమార్ సచివాలయంలోని తన గదిలోకి శుక్రవారం రాత్రి వెళ్లి పడుకున్నాడు. ఉదయం ఎంతకు బయటకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు తలుపులు తెరిచి చూడగా అనోజు కుమార్ అపస్మారక స్థితిలో ఉన్నట్లు గర్తించారు. వెంటనే కోతులగుట్ట సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించేందుకు ప్రయట్నించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్టుగా వైద్యాధికారి నిర్ధారించారని సహచర ఉద్యోగులు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ లతశ్రీ తెలిపారు. మృతుడు స్వగ్రామం వీఆర్‌పురం మండలం చినమట్టపల్లి. ఇటీవల ఆయన మండలలోని చూచిరేవులగూడెం వీఆర్వోగా బదిలీపై వచ్చారు. బహుశా అనారోగ్య కారణం వల్ల మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.