
గంజాయి నిందితుల అరెస్టు
● 240 కేజీలు స్వాధీనం
● ఒకరు పరారీ
అనకాపల్లి టౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు నిందితులని అరెస్ట్ చేశామని పట్టణ సీఐ టి.వి. విజయ్ కుమార్ తెలిపారు. వారి నుంచి 240 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అల్లూరి జిల్లా జి. మాడుగుల మండలానికి చెందిన సోమెలి బాలకృష్ణ(33), సోమెలి ప్రవీణ్ కుమార్(25), విస్సారపు లింగేశ్వరావు(25), చీడికాడ మండలం బయలపూడి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్(24), షేక్ హుస్సేన్(24), చేబోలు సంతోష్(28) తమిళనాడు వ్యాపారులకు గంజాయి అమ్మడానికి ఒప్పదం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జి. మాడుగులలో గంజాయిని కొనుగోలు చేసి కారులో అనకాపల్లి రైల్వే స్టేషన్‌కు తీసుకువస్తుండగా గూడ్స్‌రోడ్ జంక్షన్ వద్ద శనివారం మధ్యాహ్నం ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తన సిబ్బందితో దాడి చేసి పట్టుకున్నారు. వీరి కారుకు పైలట్‌గా మోటార్ బైక్‌పై వచ్చిన మరోక వ్యక్తి పోలీసులను చూసి పరారయ్యాడు. పట్టుబడిన ఆరుగురు నిందితుల నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ.4 వేలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. పరారైన నిందితుడు కోసం గాలిస్తున్నామన్నారు. సమావేశంలో ఎస్ అల్లు వెంకటేశ్వరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.