ఊళ్లల్లోకి నీళ్లు | - | Sakshi
Sakshi News home page

ఊళ్లల్లోకి నీళ్లు

Aug 22 2025 3:23 AM | Updated on Aug 22 2025 3:23 AM

ఊళ్లల

ఊళ్లల్లోకి నీళ్లు

● విలీనం విలవిల

గోదారమ్మ వరదతో పోటెత్తింది. భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ఉరకలేస్తూ గ్రామాల్లోకి చొచ్చుకుని రావడంతో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు, సురక్షితప్రాంతాలకు తరలివెళ్తున్నారు. పంట పొలాలు నీటమునిగాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు రహదారులను ముంచెత్తుతున్నాయి. ఒడిశాకు బుధవారం సాయంత్రం నుంచి రాకపోకలు బందయ్యాయి.
● విలీనం విలవిల
గ్రామాలను ముంచెత్తుతున్న గోదావరి వరద
ప్యాకేజీ ఇచ్చేయండి.. వెళ్లిపోతాం

వీఆర్‌ పురం మండలంలో శబరి బ్రిడ్జిని తాకిన వరద ప్రవాహం

ఆంధ్రా–ఒడిశా జాతీయ రహదారి–326ను ముంచెత్తిన వరద నీరు

గర్భిణిని వరద నీటిలోంచి గౌరిదేవిపేట పీహెచ్‌సీకి తరలిస్తున్న వైద్య సిబ్బంది

నీట మునిగిన

వడ్డుగూడెం పాఠశాల

హెల్ప్‌లైన్‌ నంబర్లు

చింతూరు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం : 9490026397,8121729228, 9701026397

కంట్రోల్‌ రూం:

కూనవరం 9652814712,

వీఆర్‌పురం 8008100892,

ఎటపాక 8332085268,

చింతూరు 9492527695

చింతూరు: క్రమేపీ పెరుగుతూ వచ్చిన గోదావరి వరద విలీన మండలాల్లో పలు గ్రామాలను ముంచెత్తుతోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 4 గంటలకు 51.90 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం అక్కడినుంచి నిలకడగా ఉంది. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గుతుండటంతో భద్రాచలం వద్ద కూడా శుక్రవారం నుంచి వరద ఉధృతి తగ్గే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు.

సుమారు వంద గ్రామాలకు..

వరదనీరు రహదారులపై చేరడంతో చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో సుమారు వందకు పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం నొఖ్వాల్‌, ఏఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు.

శబరి ఎగపోటుతో..

గోదావరికి పెరుగుతుండడంతో చింతూరు మండలంలో శబరినది ఎగపోటుకు గురై మరింత పెరిగింది. గురువారం రాత్రికి చింతూరు వద్ద శబరినది నీటిమట్టం 37 అడుగులకు చేరింది. మండలంలోని ఏజీకొడేరు, ఒడ్డుప్రాంతం మధ్య రహదారిపై వరద చేరడంతో ఒడ్డుప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద మరింత పెరిగితే ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు అక్కడి ప్రజలు సిద్ధమవుతున్నారు.

● చీకటివాగు, కుయిగూరు వాగులు చింతూరు గ్రామాన్ని చుట్టుముడుతుండటంతో చింతూరు, శబరిఒడ్డు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కుయిగూరువాగు తాకిడికి చింతూరులో వరి పొలాలు నీటమునిగాయి. సోకిలేరు, జల్లివారిగూడెం, చంద్రవంక, కుయిగూరు, చీకటివాగుల ఉధృతి మరింత పెరిగింది. దీంతో ఆంధ్రా–ఒడిశా, చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య, చింతూరు మండలంలోని 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చీకటివాగు నీరు వేగితోట రహదారిపై చేరడంతో చింతూరు నుంచి కంసులూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలోని ఉదయభాస్కర్‌ కాలనీల్లో ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు, సురక్షితప్రాంతాలకు తరలివెళ్తున్నారు.

నీట మునిగిన ఇళ్లు..

వీఆర్‌పురం: గోదావరి వరదనీరు పోటెత్తడంతో మండలంలోని గ్రామాల్లో నీరు వచ్చేస్తోంది. ఇప్పటికే సుమారు 65 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో శ్రీరామగిరి, గుండుగూడెం, వడ్డిగూడెం, వడ్డిగూడెం కాలని, ములకపల్లి కల్తూనూరు తదితర గ్రామాల్లో సుమారు 390 ఇళ్లు నీటమునిగాయి. ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు, సురక్షితప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాలైన కన్నాయిగూడెం చింతరేగిపల్లి గుండుగూడెం పత్తిపాక గ్రామాలకు బోటు సాయంతో సర్పంచ్‌ పిట్టా రామారావు, తహసీల్దార్‌ సరస్వతి, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ వెళ్లారు. పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేలా అప్రమత్తం చేశారు.

● మండల కేంద్రం కేంద్రం రేఖపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో ధర్మతాళ్లగూడెం, ఒడ్డుగూడెం కాలనీ, గొల్లగూడెం, రేఖపల్లి ఎస్టీ కాలనీ, పెదమట్టపల్లి, రేగడిగొమ్ము, సున్నవారిగూడెం, తుష్టివారి గూడెం, రామవరం, సొప్పల్లి, ములకనపల్లి, తెల్లవారిగూడెం గ్రామాల్లో సిబ్బంది వైద్య శిబిరాలు నిర్వహించారు. ముంపునకు గురైన వడ్డుగూడెం కాలనీని ఎస్పీ అమిత్‌బర్దర్‌, చింతూరు అడిషనల్‌ ఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా, సీఐ కన్నప్పరాజు సందర్శించారు. ప్రజలను అప్రమత్తం చేశారు. సహాయకచర్యలపై సూచనలు చేశారు. వీఆర్‌పురంలో గురువారం కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, రంపచోడవరం తహసీల్దార్‌ సరస్వతి, ఎంపీడీవో ఇమ్మానుయేల్‌ పర్యటించారు.

త్యాగానికి ప్రతిఫలమిదేనా?

పోలవరం ప్రాజెక్ట్‌కోసం సర్వస్వం కోల్పోయి త్యాగం చేసిన విలీన మండలాల ప్రజలకు వరద తిప్పలు తప్పడం లేదు. ఏటా జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వరద భయంతో బిక్కు బిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోంది.

కూనవరం : మాకీ బాధలు వద్దు సార్‌.. ప్యాకేజీ ఇచ్చేస్తే.. వెళ్లిపోయి కలోగంజి తాగి బతుకుతాం అంటు ఉదయ్‌భాస్కర్‌ కాలనీ వరద బాధితులు కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఎగువున కురుస్తున్న భారీ వర్షాలకు శబరి, గోదావరి నదులకు వరద పోటెత్తింది. దీంతో మండల కేంద్రంలోని ఉదయ్‌భాస్కర్‌ కాలనీకి చెందిన 120 కుటుంబాలను ముందస్తు చర్యల్లో భాగంగా టేకులబోరులోని మెరక ప్రదేశమైన గిరిజన బాలబాలికల ఆశ్రమ పాఠశాలకు తరలించి పునరావాసం కల్పించారు. అలాగే గిన్నెల బజారుకు చెందిన 49 కుటుంబాలను స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో పునరావాసం ఏర్పాటు చేశారు. శబరికొత్త గూడెంలో 8 కుటుంబాలను మెరకప్రదేశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో టేకులబోరు, గిన్నెలబజార్‌ కేంద్రాలను గురువారం కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సందర్శించారు. వారికి అందిస్తున్న నిత్యావసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాదితులు తమ బాధలను కలెక్టర్‌కు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఓపిక పట్టండి.. వచ్చే సంవత్సరం తప్పనిసరిగా ప్యాకేజీ ఇచ్చి పంపిస్తాం అన్నారు. ఇప్పటికే 16 గ్రామాల్లో ఆర్‌అండ్‌ఆర్‌ వెరిఫికేష్‌ పూర్తి అయిందని, స్థల సేకరణ ప్రక్రియ సైతం వేగవంతంగా జరుగుతుందన్నారు. ఆయన వెంట రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ శుభం నోఖ్వాల్‌, ఏఎస్పీ పంకజ్‌ కుమార్‌ మీనా, ఎస్‌డీసీ అంబేద్కర్‌, తహసీల్దార్‌ కె.శ్రీనివాసరావు, ఎంపీడీవో జగన్నాధరావు, సర్పంచ్‌ హేమంత్‌ కుమార్‌, ఎస్సై లతశ్రీ ఉన్నారు.

భద్రాచలం వద్ద

పెరుగుతున్న నీటిమట్టం

ముంపులో రహదారులు

శుక్రవారం నాటికి వరద ఉధృతి

తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్న సీడబ్ల్యూసీ అధికారులు

టేకులబోరు పునరావాస కేంద్రంలో వరద

బాధితులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

ఊళ్లల్లోకి నీళ్లు1
1/8

ఊళ్లల్లోకి నీళ్లు

ఊళ్లల్లోకి నీళ్లు2
2/8

ఊళ్లల్లోకి నీళ్లు

ఊళ్లల్లోకి నీళ్లు3
3/8

ఊళ్లల్లోకి నీళ్లు

ఊళ్లల్లోకి నీళ్లు4
4/8

ఊళ్లల్లోకి నీళ్లు

ఊళ్లల్లోకి నీళ్లు5
5/8

ఊళ్లల్లోకి నీళ్లు

ఊళ్లల్లోకి నీళ్లు6
6/8

ఊళ్లల్లోకి నీళ్లు

ఊళ్లల్లోకి నీళ్లు7
7/8

ఊళ్లల్లోకి నీళ్లు

ఊళ్లల్లోకి నీళ్లు8
8/8

ఊళ్లల్లోకి నీళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement