
కల్వర్టు గోతిలో పడి యువకుడి మృతి
జి.మాడుగుల: హైవే 516ఈ రోడ్డు నిర్మాణాల్లో భాగంగా పాడేరు వైపు మార్గంలో కె. కోడాపల్లి వద్ద కల్వర్టు నిర్మాణానికి తీసిన గోతిలో ప్రమాదవశాత్తూ పడి యువకుడు మృతి చెందాడు. ఇటీవల కురిసిన వర్షాలకు గోతిలో నీరు చేరడంతో ఊబి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం అటుగా వెళ్తున్న కె.కోడాపల్లి గ్రామానికి చెందిన పలాసి సోమేష్ (22) అనే గిరిజన యువకుడు ప్రమాదవశాత్తూ జారి గోతిలోపడి పోయాడు. ఊబిలో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందాడు. హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్
గిరిజన యువకుడు పలాసి సోమేష్ మృతికి హైవే అధికారుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతికి కారణాలను కుటుంబసభ్యుల నుంచి ఆయన తెలుసుకున్నారు. హైవే అధికారులు కనీస భద్రత చర్యలు చేపట్టకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతదేహంతో ఆందోళన
న్యాయం చేయాలని కోరుతూ సోమేష్ మృతదేహంతో హైవేపై కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో చింతపల్లి వైపు నుంచి పాడేరు వస్తున్న మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరిని బాధిత కుటుంబ సభ్యులు ఆడ్డుకున్నారు. హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని, తమకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆమెను నిలదీశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ షణ్ముఖరావు సంఘటన స్థలాన్ని సందర్శించారు.
హైవే అధికారుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆవేదన
మృతదేహంతో ఆందోళన
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస
విశ్వేశ్వరరాజు డిమాండ్
న్యాయం చేయాలంటూ అదేమార్గంలో వస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని నిలదీసిన ఆందోళనకారులు

కల్వర్టు గోతిలో పడి యువకుడి మృతి

కల్వర్టు గోతిలో పడి యువకుడి మృతి