
పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు
చింతపల్లి: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంట స్థితి గతులపై అవగాహన, రైతులకు సూచనలు అందించేందుకు వ్యవసాయశాఖ సిబ్బందితో కలిసి, ప్రాంతీయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ బాల హుస్సేన్‌రెడ్డి, వెంకటేష్ బాబు, జోగారావులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. జికే.వీధి మండలంలోని పెదవలస, బూసులు, పోరుమామిడి, సంపెంగ, ఎర్ర చెరువులు, రింతాడ, దుచ్చెరపాలెం, ఏబులం గ్రామాల్లో బుధవారం విస్తృతస్థాయి పరిశీలన చేశారు. వివిధ దశల్లో ఉన్న వరి, వేరుశనగ, మొక్కజొన్న, రాగి, తీపి దుంప, పసుపు పంటలను పరిశీలించారు. ఒకటి, రెండు చోట్ల కట్టలు తెగి నీరు వరి పొలాలపై ప్రవహించడం తప్ప, ఎక్కడ పంట నష్టం జరగలేదని వారు పేర్కొన్నారు. రాగి పంటలో అగ్గి తెగులు వ్యాప్తి చెందిందని, నివారణకు లీటరు నీటికి రెండు గ్రాముల కార్పెండిజం పొడియం మందును కలిపి పిచికారీ చేయాలని సూచించారు. తీపి దుంపను ఆశించిన తెగులను నివారించేందుకు మందు పిచికారీ చేయాలన్నారు.